RANABAALI ఫుల్ రివ్యూ: విజయ్ దేవరకొండ మూవీ ఎలా ఉందంటే?

RANABAALI ఫుల్ రివ్యూ: విజయ్ దేవరకొండ మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ (RANABAALI). దసరా కానుకగా శుక్రవారం (అక్టోబర్ 16, 2026న) మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుమారు 200 ఏళ్ల క్రితం దక్షిణాదిలో సంభవించిన మహా కరవు, ఆ సమయంలో బ్రిటిషర్ల దాష్టీకాలను కళ్లకు కడుతూ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

ఆకలి, కష్టాలు ఒకవైపు.. అధికారాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి మరోవైపు.. ఈ రెండింటి మధ్య రణబాలి (విజయ్ దేవరకొండ) ప్రయాణం ఎటూ సాగింది? రణబాలి భార్యగా జయమ్మ (రష్మిక మందన్న) అతడి పోరాటంలో ఎలాంటి పాత్ర పోషించింది? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

‘రణబాలి’ కథగా.. 

1876–78 మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని కరువు నేపథ్యంలో సాగే కథ ఇది. రాయలసీమలోని సింగనమల ప్రాంతంలోని పాలెగాళ్ల కుటుంబానికి వారసుడు రణబాలి (విజయ్ దేవరకొండ). పురిటిలోనే తనువు చాలించడంతో తల్లి (ఈశ్వరీరావు) తమ కులదైవం భద్రమల్లన్నను శరణువేడగా, ఆ స్వామి శిశువుకు ఊపిరి పోసి, రెండు పుష్కరాల ఆయుష్షుతో దీవిస్తాడు. పెరిగి పెద్దవాడైన రణబాలి ఆ ప్రాంత వాసులకు అండగా ఉంటూ ఊరిని కాపాడే పోతురాజుగా నిలబడతాడు. సీమ పౌరుషంతో మొరటుగా పెరిగిన తన కొడుక్కి ముక్కు తాడు వేసేందుకు జయమ్మ (రష్మిక మందన్న)ను ఇచ్చిన పెళ్లి చేస్తుంది తల్లి. భర్తను మార్చుకునే ప్రయత్నం చేస్తుంటుంది జయమ్మ. మరోవైపు అసలే వర్షాలు లేక ఇబ్బందిపడుతున్న ప్రజలకు తిండి ధాన్యం దక్కకుండా చేసి, ఆ ధాన్యాన్ని  మద్రాస్ ఓడరేవు ద్వారా  బ్రిటీష్ వాళ్లు తరలించాలనుకుంటారు. ఇందుకు రోడ్డు మార్గం కష్టమని రైలు మార్గం నిర్మిస్తుంటారు. కరువు రాక్షసుడిగా పేరుగాంచిన బ్రిటీష్‌  అధికారి సర్ థియోడర్ హెక్టర్‌‌ (ఆర్నాల్డ్ వోస్లూ) నేతృత్వంలో ఇదంతా జరుగుతుంటుంది. రైల్వే లైన్ నిర్మాణానికి వచ్చిన కూలీలను బానిసలుగా మార్చి హింసిస్తుంటారు. విషయం తెలుసుకున్న రణబాలి బ్రిటీష్ వాళ్లను ఎలా ఎదిరించాడు... కరువు రక్కసి బారి నుంచి తన వాళ్లను ఎలా కాపాడుకున్నాడు.. ఇందుకోసం అతను ఏం చేశాడు.. చివరికి ఏం జరిగింది అనేది మిగతా కథ.

మూవీ ఎలా ఉందంటే..

భారతదేశ చరిత్రలో మరుగున పడిన వాస్తవ ఘటనలకు కొన్ని జానపద కథలు, ఇంకొంత ఫిక్షన్ జోడించి దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌ ఈ  చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా 1876–78 మధ్య  వచ్చిన మద్రాసు కరువుతో 80 లక్షల మంది భారతీయులు మరణించిన ఘటనను నేపథ్యంగా ఎంచుకున్నారు. అప్పటి బ్రిటీష్‌ అధికారుల దౌర్జన్యాలు, తినడానికి తిండి లేక జనం ఆకలి చావుల నేపథ్యంలో రాయలసీమకు చెందిన ఓ పాలెగాడు చేసిన పోరాటం ప్రధానాంశం. 

ఫస్ట్ హాఫ్‌లో ఓవైపు హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూనే, మరోవైపు ఆ ప్రాంతంలోని కరువు పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ కథను ఆసక్తికరంగా నడిపించారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం సినిమాకు మంచి హై ఇచ్చింది. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా కథపై ఆసక్తిని పెంచుతూ సాగుతాయి. సెకండాఫ్‌లో కథనం కాస్త భిన్నమైన మలుపులు తీసుకుంటూ, కీలక సన్నివేశాలతో ముందుకు సాగుతుంది. అక్కడక్కడా వచ్చే హై మూమెంట్స్ కథకు మరింత బలాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం వేగం పుంజుకుని ఉత్కంఠను పెంచుతుంది. ఇక క్లైమాక్స్‌లో రొటీన్‌కు భిన్నంగా చేర్చిన అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. మొత్తంగా, మరుగునపడిన ఆకలి కేకలు చితిరిత్ర, హీరో ఎలివేషన్స్, చారిత్రక నేపథ్యం, కీలక మలుపులు, భిన్నమైన ముగింపు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ALSO READ : ‘రణబాలి’కి పాజిటివ్ టాక్..

అయితే ఎంచుకున్న కథలో నిజాయితీ ఉన్నప్పటికీ చరిత్రను ప్రధానకథతో అనుసంధానం చేయడంలో, ఆసక్తిగా కథ నడిపించడంలో దర్శకుడు తడబడిన భావన కలుగుతుంది. నిజానికి బ్రిటీష్‌ వాళ్లను ఎదురించి పోరాడిన ఎంతమంది యోధుల జీవితాలు విషాదాంతాలే అని అందరికీ తెలిసిందే. ఈ విషయంలోనే దర్శకుడు చరిత్రకు జానపదాన్ని జోడించి, భద్రమల్లన్న స్వామి చుట్టూ ఆసక్తికరమైన అంశాలను అల్లుకున్నాడు. అది ఈ సినిమాకు ప్లస్ అయింది. ఏదేమైనా చరిత్రలో మరుగునపడిన వాస్తవాలను ఈ సినిమా ద్వారా ప్రజలకు చెప్పాలకున్న దర్శకుడి నిజాయితీ మెచ్చుకోదగ్గది. విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకోకుండా, బ్రిటీష్‌ పాలకులను ఎదురించి పోరాడిన ఓ పాలెగాడి కథగా ఈ సినిమాను చూస్తే  ఏమాత్రం నిరాశ పరచదు.

నటీనటుల నటన..

రణబాలి పాత్ర కోసం విజయ్ దేవరకొండ తనను తాను మార్చుకున్న తీరు ఆకట్టుకుంది. తన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో పాటు రాయలసీమ యాస విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన గత పాత్రలకు భిన్నంగా ఇందులో రణబాలి మాత్రమే కనిపించేందుకు అతని పడ్డ తపన తెరపై కనిపిస్తుంది. కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రేషన్స్‌ కాస్త ఎక్కువైనట్టు అనిపించినా క్యారెక్టర్‌ కోసం విజయ్ పెట్టిన కష్టం దాన్ని డామినేట్ చేస్తుంది.

ఇక జయమ్మగా మరో కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ రష్మికకు దక్కింది. సీరియస్‌గా జరుగుతున్న కథకు తన సీన్స్‌ ఊరటనిచ్చాయి. ఇద్దరి కెమిస్ట్రీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో తన నటన ఆకట్టుకుంది. మరోసారి తల్లి పాత్రలో ఈశ్వరీరావు జీవించారు. క్రూరుడైన బ్రిటీష్ ఆఫీసర్‌‌ హెక్టర్‌గా ఆర్నాల్డ్ వోస్లూ (‘మమ్మీ’ ఫేమ్) మెప్పించారు. మైమ్ మధు, కంచరపాలెం కిషోర్, మధు నందన్‌ సహా మిగిలిన ఆర్టిస్టులంతా పాత్రోచితంగా నటించారు.

టెక్నీకల్ అంశాలు.. 

అజయ్–అతుల్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షాల కెమెరా పనితనం పీరియాడికల్ నేపథ్యానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శివం రావు నాగసాని రూపొందించిన ఆర్ట్ వర్క్, బ్రిటిష్ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు సాలిడ్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. చివరగా.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.. ‘రణబాలి’తో మరో మెట్టు ఎక్కారు. కరువు కష్టాలు, బ్రిటిషర్ల దాష్టీకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, యాక్షన్‌, భావోద్వేగాలతో సినిమాను ఆసక్తికరంగా మలిచారు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి.