రష్యన్ ఆయిల్ టారిఫ్స్‌పై ట్రంప్ యూటర్న్.. భారత్‌కు భారీ ఊరట!

రష్యన్ ఆయిల్ టారిఫ్స్‌పై ట్రంప్ యూటర్న్.. భారత్‌కు భారీ ఊరట!

రష్యన్ ఆయిల్ పై టారిఫ్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు ఉద్దేశించిన కఠినమైన 'గ్రాహామ్ చట్టం' కింద విధించాలని అనుకున్న ఆంక్షలు, 100 శాతం టారిఫ్స్ నుంచి వెనక్కి తగ్గారు. అమెరికా జాతీయ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ట్రంప్. నవంబర్ 3న జరగనున్న మధ్యకాలిక ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా ఇంధన ధరలను తగ్గించటం, రష్యా నుంచి అదనపు డీజిల్ సరఫరాలను పొందడమే లక్ష్యంగా ట్రంప్ ఈ ఎత్తుగడ వేశారు.

రష్యా నుంచి అత్యధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. సెప్టెంబర్‌లో ఆమోదం పొందిన 'లిండ్సే ఓ. గ్రాహామ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' ప్రకారం.. రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు పడే ప్రమాదం ఉంది. ఇది భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 

అయితే ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ కఠినమైన సుంకాలు, ఆంక్షలను తాత్కాలికంగా మినహాయించడంతో భారత్‌కు భారీ ఊరట లభించింది. ప్రస్తుతానికి ఇండియా ఇంధన దిగుమతులను ఎలాంటి భయాలు లేకుండా కొనసాగించడానికి, వాణిజ్యపరమైన అనిశ్చితిని తగ్గించుకోవడానికి ట్రంప్ తాజా నిర్ణయం దోహదపడుతుంది.   

అంతర్జాతీయంగా చూస్తే.. ఈ నిర్ణయం ప్రపంచ ఇంధన మార్కెట్లో ఒడిదుడుకులను కొంతవరకు నియంత్రించగలదు. రష్యాపై పూర్తిగా ఆంక్షలు అమలులోకి వస్తే గ్లోబల్ మార్కెట్‌లో ఆయిల్ సరఫరా తగ్గి ధరలు విపరీతంగా పెరిగేవి. కానీ ట్రంప్ తీసుకున్న ఈ మినహాయింపు నిర్ణయం, రష్యాతో కుదుర్చుకున్న కొత్త డీజిల్ ఒప్పందాలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అదుపులో ఉండటానికి సహాయపడతాయి. ముఖ్యంగా అమెరికాలో రవాణా, వ్యవసాయ రంగాలపై పడుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు. మొత్తానికి రష్యాతో రాజకీయ వైరం కొనసాగిస్తూనే.. అమెరికా ఆర్థిక అవసరాల కోసం ట్రంప్ వెనకడుగు వేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.