CMRL మనీలాండరింగ్ కేసు.. పినరయ్ విజయన్ కు ED నోటీసులు

CMRL మనీలాండరింగ్ కేసు.. పినరయ్ విజయన్ కు ED నోటీసులు

CMRL మనీలాండరింగ్ కేసులో కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) మరోసారి నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 23న కొచ్చిలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.ఈడీ ఫిర్యాదు మేకు విజయన్, అతని కుమార్తె వీణా విజయన్ పై కేసు నమోదు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించిన క్రమంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. అయితే  తనపై వస్తున్న ఆరోపణలను విజయన్ తీవ్రంగా ఖండించారు. 

గత  ఆగస్టులో విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. అంతకుముందు మే 27న  వీణా, CMRL ప్రమోటర్ల  ఇండ్లలో  ఈడీ సోదాలు నిర్వహించింది.  సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇన్ వాల్వ్ అయిన వ్యక్తుల పేర్లు, లావాదేవీల మొత్తాలు, దుబాయ్‌కి పంపిన నగదు వివరాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఈడీ ప్రకారం, దాదాపు 3.49 లక్షల యూఏఈ దిర్హమ్‌లు, అంటే సుమారు రూ. 85 లక్షలు దుబాయ్‌కి బదిలీ అయ్యాయని భారత కరెన్సీలో సుమారు రూ. 20.05 కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీల వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది. వీణా విజయన్‌కు చెందిన ఓ డిజిటల్ డివైజ్ లో వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయిన సిమ్ కార్డు  దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ సిమ్ కార్డును ఇంటర్నెట్ కాలింగ్ కోసం ఉపయోగించి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది.

సోదాల్లో హవాలా లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయని ఈడీ తెలిపింది. పలు డిజిటల్ డివైజ్ లను సీజ్ చేసి పలువురి నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది. హవాలా మార్గాల ద్వారా డబ్బు బదిలీకి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయని ఈడీ చెబుతోంది. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో లభించిన లావాదేవీల వివరాలు వీణా విజయన్‌కు తెలిసిన ఆదాయ వనరులను మించి ఉన్నాయని, ఆమె CMRL నుంచి అందుకున్నట్లు ఆరోపించబడిన నగదు అయి ఉండొచ్చని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఈడీ తెలిపింది.