భారతీయ గేమింగ్ రంగం 50 కోట్ల మందికి పైగా యూజర్లతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. 2025లో రూ. 6వేల 300 కోట్లుగా ఉన్న భారతీయ గేమింగ్ పరిశ్రమ ఆదాయం, ఏటా 13 శాతం వృద్ధితో 2028 నాటికి రూ. 9వేల 200 కోట్లకు చేరుతుందని యాక్సెస్ పార్ట్నర్షిప్ రిపోర్ట్ అంచనా. ఈ నేపథ్యంలో ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ 'రాబ్లాక్స్' భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. 2020 నుంచి 2025 మధ్య దేశంలో రోబ్లాక్స్ రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది.
ఈ వేదిక కేవలం వినోదం మాత్రమే కాకుండా.. భారతీయ క్రియేటర్లకు ఉపాధి, ఆదాయ వనరుగా మారుతోంది. గత ఐదేళ్లలో రాబ్లాక్స్ ద్వారా ఆదాయం పొందే ఇండియన్ క్రియేటర్ల సంఖ్య ఏటా 96 శాతం పెరిగింది. సంప్రదాయ కోడింగ్ అనుభవం లేకున్నా.. సులభమైన టూల్స్ సహాయంతో ఎంతో మంది చిన్న స్టూడియోలు, యువ క్రియేటర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారు. బెంగళూరుకు చెందిన 'స్మాల్ వరల్డ్ గేమ్స్', న్యూఢిల్లీకి చెందిన 'మెటా ఫ్యాషన్' వంటివి భారత్‌లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
భారతీయ సృష్టికర్తలు రూపొందించే కంటెంట్‌కు అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. విదేశీ యూజర్ల ద్వారానే ద్వారానే కంటెంట్ క్రియేటర్లకు ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా లభించే నైపుణ్యాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తున్నాయి. 2020-2025 మధ్య కాలంలో రోబ్లాక్స్ క్రియేటర్ల కార్యకలాపాల ద్వారా భారతదేశ జీడీపీకి రూ. 123.9 కోట్ల మేర లభించడమే కాక, వందలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
