తెలుగురాష్ట్రాల్లో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మూల నక్షత్రం రోజున ( అక్టోబర్ 16)న అమ్మవారు చదువుల తల్లిగా సరస్వతి దేవి రూపంలో భక్తులను ఆశీర్వదించారు. తిరువూరు గౌరీ కేదారీశ్వర దేవాలయంలో అమ్మవారికి ఘనంగా పూజలు జరిగాయి. అమ్మవారికి ఒక్కో అవతార రూపంతో అలంకరణ చేస్తారు. ఆశ్వయుజ మాసంలో, మూలనక్షత్ర తరుణంలో అమ్మవారిని సరస్వతిగా అలంకరించారు.
ముల్లోకాలకు ఆడబిడ్డ అయిన అమ్మవారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో వివిధ రూపాలుగా పూజలు చేస్తున్నారు. తిరువూరు గౌరీ దేవి కేదారీశ్వర దేవాలయంలోని మంగళ గౌరీ అమ్మవారు అక్టోబర్ 16న సరస్వతి రూపంలో భక్తులకు దర్శమిచ్చారు.
మూల నక్షత్రం రోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు జరిగాయి. దసరా ఉత్సవాల్లో విశేషంగా అలంకారాలు .. కుంకుమార్చనలు..చండీ హోమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు అరిపిరాల అప్పయ్యశాస్త్రి, శ్రీనివాస్ శర్మ, మణికంఠ తెలిపారు.
దసర శరన్న వరాత్రుల్లో 'మూల' నక్షత్రంలో అలంకృతమైన సరస్వతీమాత కూడా అంతే ప్రాశస్త్యం పొందింది. ఈ పర్వదినాన అమ్మవారి సన్నిధిలో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు తల్లిదండ్రులు. యాజ్ఞ వల్క్యుడు, వాల్మీకి, వ్యాసుడు, ఆది శంకరులు మొదలైన మహనీయు లెందరో మహామాతను ఆరాధించి, జ్ఞానమూర్తులై విశ్వానికి వెలుగుదారులు చూపారు.
'మనిషికి విద్యే రూపం, ధనం, ఆభరణం. విద్య విదేశ బంధువు. గురువులకు గురువు. రాజ పూజితం. విద్యా విహీనుడు పశు సమానుడు' అంటాడు భర్తృహరి. విద్వాంసుడు ఎక్కడైనా గౌరవం పొందుతాడు. విద్య అనే సంపదను ఎవ్వడూ దొంగిలించలేడు. అజ్ఞానాంధకారాన్ని దూరం చేసే జ్ఞానం, నిజమైన సుఖాన్ని కీర్తిని ప్రసాదించే ధనం- విద్య ఒక్కటే. శరన్నవరాత్రుల్లో జరిగే ఈ సరస్వతి పూజ అత్యంత శ్రేయస్కరమైందని పండితులు చెబుతున్నారు.
