అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. వీటిలో ఒకటి తుఫానుగా మారే ఛాన్సుందని, వచ్చే వారంలో దీనిపై స్పష్టత రావొచ్చని చెబుతోంది. ఇదిలా ఉండగా దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై వాయవ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తాంధ్రాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ, ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
