ఏపీలోని సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం చైతు చేసుకుంది.. పెనుగొండ-గొల్లపల్లి రిజర్వాయర్ లో దిగి ఐదుగురు బాలికలు మృతి చెందారు. శుక్రవారం ( అక్టోబర్ 16 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. దర్గాపేటకు చెందిన ముస్లిం కుటుంబం విహారయాత్రకు వెళ్ళింది. వీరిలో ఐదుగురు బాలికలు రిజర్వాయర్ లో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయారు.
సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రిజర్వాయర్ కి వెళ్లిన బాలికలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నీటి లోతు తెలియక లోపలికి వెళ్లడంతో బురదలో చిక్కుకుని బయటకు రాలేక ఒక్కొక్కరుగా నీటిలో మునిగిపోతుంటే కాపాడేందుకు ఎవరూ లేకపోవడం అత్యంత బాధాకరం. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రిజర్వాయర్ దగ్గరికి పరుగులు తీయగా అప్పటికే ఘోరం జరిగిపోయింది.
మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్న దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తోంది. ఒక్కసారిగా ఐదుగురు మహిళలు లేకపోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర శోకం వెల్లువెత్తుతోంది. చిన్నారులు తల్లుల కోసం వెతుకుతున్న దృశ్యం చూసి స్థానికులు సైతం కన్నీరు ఆపుకోలేకపోతున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు కుటుంబసభ్యులు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలికల కోసం గాలింపు చేపట్టి మృతదేహాలని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనా లేక ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బాలికలు మృతి చెందడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో దర్గాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
