ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజునే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. ఎస్ఎన్ కాలనీలోని వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
ఈ హింసాత్మక ఘటనలో వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట నిలిచి ఉంచిన వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాదాపు 15 కార్లు దెబ్బతినగా, వాటిలో 4 కార్లకు నిప్పు పెట్టడంతో కాలిబూడిదయ్యాయి. దాడి జరిగిన సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పార్టీ కార్యాలయంలోనే ఉండటంతో పరిస్థితి మరింత హీట్ ఎక్కింది.
రాయలసీమలోని మరో కీలక ప్రాంతమైన పుంగనూరులోనూ ఇదే రీతిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి తన పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కోసం వస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. రాళ్లు, కర్రలతో జరిగిన పరస్పర దాడుల్లో కొందరు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకత లేదని, ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని ఇరుపార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల వేళ చెలరేగిన ఈ ఘర్షణలు రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. హింసాత్మకమైన పరిస్థితులను పోలీసులు భారీగా మోహరించినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సంఘం నిబంధనలను కఠినంగా అమలు చేసి, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
