జంతర్ మంతర్ డీనోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్: కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు

జంతర్ మంతర్ డీనోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్: కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు

ఢిల్లీలో చారిత్రక ప్రదేశమైన జంతర్ మంతర్‌ను నిరసనలు తెలిపేందుకు వీలులేని ప్రదేశంగా డీనోటిఫై చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను వివరణ కోరింది. ప్రధాన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. ఈ నిర్ణయం కోర్టు మౌఖిక పరిశీలనల కారణంగా జరిగిందా లేక స్వతంత్ర అంచనా మేరకా వెల్లడించాలని న్యాయస్థానం స్పష్టత కోరింది.

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల ఆధారంగా.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ అక్టోబర్ 11న జంతర్ మంతర్‌ను నిరసన వేదికగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి బదులుగా రామ్‌లీలా మైదానం, బురారీ మైదానం, సీబీడీ గ్రౌండ్‌లను ప్రత్యామ్నాయ వేదిక ప్రాంతాలుగా కేటాయించారు. అయితే ఈ నిర్ణయంపై అడ్వకేట్ స్వాతి సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తూ.. సీనియర్ అడ్వకేట్లు ముక్తా గుప్తా, గోపాల్ శంకరనారాయణన్‌లు జంతర్ మంతర్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అధికార వర్గాలకు, ప్రభుత్వ సంస్థలకు సమీపంలో ఉండటం వల్లే నిరసనకారులు తమ గొంతును సమర్థవంతంగా వినిపించగలరని తెలిపారు. ఢిల్లీ నగరం కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకూడదని.. నిరసన తెలిపే ప్రాథమిక హక్కును మోడీ సర్కార్ నిర్ణయం కాలరాస్తోందని వారు వాదించారు.

ALSO READ : ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. 2018 నాటి కేసులో సమన్లు

ఈ అంశంపై స్పందించిన ధర్మాసనం.. అధికారుల నుంచి అఫీషియల్ జవాబు అందిన తర్వాతే దీనిపై లోతుగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసనల ప్రాముఖ్యత, ప్రత్యామ్నాయ వేదికల ప్రభావంపై అన్ని వాదనలను విన్న తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.