తాత వయసున్న వ్యక్తితో 30 ఏళ్ల యువతి ప్రేమ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట..

  తాత వయసున్న వ్యక్తితో 30 ఏళ్ల యువతి ప్రేమ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట..

ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు.. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. 75 ఏళ్ల రామ్‌షుగర్‌.. 30 ఏళ్ల రాణి రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరి మధ్య ఏకంగా 45 ఏళ్ల వయసు తేడా ఉండటంతో ఈ జంట గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

కూతురి ఇంటికి వెళ్తూ.. 
ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాకు చెందిన రామ్‌షుగర్‌ (75), రాణి రాజ్‌పుత్‌ (30) మధ్య పరిచయం ఏర్పడినట్లు సమాచారం. రాణి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుంటారు. ఆమె రామ్‌షుగర్‌ కూతురిని కలవడానికి తరచూ ఆయన ఇంటికి వెళ్లేదని తెలుస్తోంది.

ఈ క్రమంలో రామ్‌షుగర్‌, రాణి మధ్య పరిచయం పెరిగి, అది ప్రేమగా మారినట్లు  చెబుతున్నారు. వీరిద్దరూ దాదాపు ఏడాది కాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. వాళ్ళ  బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ జంట ఇప్పటికే ఉంగరాలు మార్చుకున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ తర్వాత వివాహం చేసుకోనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

వైరల్‌గా మారిన జంట 
ఈ జంటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఇద్దరూ సంతోషంగా కనిపిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న 45 ఏళ్ల వయసు తేడానే ఈ వీడియోపై మరింత చర్చకు కారణమైంది. సాధారణంగా ఇంత పెద్ద వయసు తేడాతో సంబంధాలు అరుదుగా కనిపించడంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ జంట పెళ్లి నిర్ణయంపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వస్తున్నాయి. కొందరు వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు వయసు తేడా ప్రస్తావిస్తూ ఫన్నీ  కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు “ప్రేమ నిజంగా గుడ్డిదేనా?” అంటూ ప్రశ్నించగా, ఇంకొందరు ఈ సంబంధం వెనుక ఉన్న కారణాలపై ఆసక్తి చూపించారు. ఓ నెటిజన్‌ అయితే ఆ వృద్ధుడి ఆస్తి ఎంత ఉంటుందంటూ కామెంట్ చేయడం కూడా చర్చకు దారితీసింది.

ప్రేమకు వయసు అడ్డంకి కాదా?
ఈ ఘటన మరోసారి ప్రేమ, పెళ్లి, వయసు తేడా వంటి అంశాలపై చర్చకు తెరతీసింది. ఇద్దరి మధ్య వయసు ఎంత తేడా ఉన్నా, వారి వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ జంట సంబంధం వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాహ తేదీపై  ఖచ్చితమైన సమాచారం లేదు. ప్రస్తుతం మాత్రం 75 ఏళ్ల వృద్ధుడు, 30 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో  చర్చకు కారణమైంది.