చెదరని కల: ఇంజినీరు కావాలనుకున్న టీచర్.. ఇంజినీర్లతో నమస్కారాలు అందుకున్నాడు..

చెదరని కల:  ఇంజినీరు కావాలనుకున్న టీచర్.. ఇంజినీర్లతో నమస్కారాలు అందుకున్నాడు..

ప్రతిఒక్కరికి ఒక కల ఉంటుంది.  జీవితంలో ఏదో సాధించాలని కలలు కంటారు.  కొంతమంది అనుకున్న గోల్​ ను అందుకుంటారు.  కొన్ని పరిస్థితిల్లో కొంతమంది ఆ కలను చేరుకోలేక సాధించిన దానితో తృప్తి పొందుతారు.  కాని ఇంజనీరు కావాలనుకున్న ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితుల రీత్యా టీచర్​ అయ్యాడు.  ఓ రోజు తన స్టూడెంట్స్​ తో కెనాల్​ పనుల గురించి వివరించేందుకు ఫీల్డ్​ వర్క్​కు  తీసుకెళ్లాడు.  అక్కడకు వచ్చిన ఇంజినీర్లందరూ ఆ టీచర్​ కు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.  

రాఘవాపూర్​ లోని స్కూల్లో తిరుపతి టెన్త్ రా చదువుతున్నాడు. టీచర్లు చెప్పిన ప్రతి పాఠాన్ని చిటికెలో అప్పజెప్పేవాడు. తిరుపతి తెలివితేటలను చూసి టీచర్లు ఎప్పుడూ మెచ్చుకునేవాళ్లు. అతనికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. లెక్కలు బాగా చేసి అందిరితో 'శెభాష్' అనిపించుకునేవాడు. 'నువ్వు భవిష్యత్తులో ఇంజినీర్ అవుతావని టీచర్లు అనేవాళ్లు.

తిరుపతిది చాలా పేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి తండ్రి కూలీ పనులు, తల్లి బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాళ్లు. కష్టపడి ఇద్దరు ఆడపిల్లల పెండ్లిళ్లు చేశారు. ఊర్లో అందరూ
తిరుపతి తెలివి..మంచితనం చూసి.. 'బంగారం లాంటి బిడ్డను కన్నార'ని తల్లిదండ్రులతో చెప్పేవాళ్లు. తిరుపతి టెన్త్ తర్వాత సిటీకి వెళ్లి ఇంటర్మీడియెట్ చదివాడు. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదవాలనుకున్నా డబ్బులేక బీఎడ్ చేశాడు. కానీ... చిన్న వయసులోనే గవర్నమెంట్ ఉద్యోగం సాధించాడు.

ఒక మారుమూల ప్రాంతంలోని స్కూల్​ కు మ్యాథ్స్ టీచర్ గా వెళ్లాడు. అక్కడి వాతావరణం చూడగానే అతనిలో కొత్త ఎనర్జీ వచ్చింది. కానీ, తన మనసులో 'ఇంజినీర్' లక్ష్యాన్ని సాధించలేకపోయానన్న బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది. మారుమూల ప్రాంతంలోని పిల్లలకు చదువు
చెప్తూ అందులోనే తృప్తి పొందేవాడు. స్కూల్లో రెండు వందల మందికిపైగా పిల్లలు ఉన్నారు. టీచర్లు మాత్రం నలుగురే. దాంతో తిరుపతే అన్ని సబ్జెక్టులపై పట్టు తెచ్చుకుని, పిల్లలకు చెప్పేవాడు. స్కూల్లోనే ఒక రూంలో ఉండేవాడు. పిల్లలు ఏ టైంలో స్కూలుకు వచ్చినా.. వాళ్ల డౌట్లు తీర్చేవాడు. ఒక్కోసారి రాత్రి వరకూ పాఠాలు చెప్పేవాడు. స్టూడెంట్స్ కూడా బాగా కష్టపడి చదివేవాళ్లు. తిరుపతి చెప్పిన పాఠాల వల్ల వాళ్లలో క్రియేటివిటి బాగా పెరిగింది. 

తిరుపతి చదువు చెప్పే స్కూల్లో టెన్త్ స్టూడెంట్స్.. ఆ జిల్లా టాప్ టెన్ ర్యాంకుల్లో రెండు సాధించారు. బాగా చదువు చెప్పినందుకు టీచర్లను జిల్లా అధికారులు. ఊరివాళ్లు మెచ్చుకున్నారు.అలా తిరుపతి ఆ ఊరికి వెళ్లినప్పటినుంచి స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ర్యాంక్స్ సాధించారు. ఆ తర్వాత మరో ఊరికి ట్రాన్స్ ఫర్ అయ్యింది... ఇలా ఎన్నో ఊళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పాడు. ఎక్కడ పనిచేసినా మంచి టీచర్ గా గుర్తింపు తెచ్చకున్నాడు. కానీ అతనిలో ఇంజినీర్ కాలేకపోయాననే బాధ మాత్రం అలానే ఉంది. 

ఒకసారి ఆయన పని చేస్తున్న స్కూల్లోని పిల్లలను తీసుకుని పక్క ఊళ్లో జరుగుతున్న వాటర్ కెనాల్ పనుల దగ్గరికి వెళ్లాడు. తిరుపతి అక్కడ టన్నెల్ పనుల గురించి స్టూడెంట్స్ చెప్తుండగా.. అంతలోనే పెద్ద పెద్ద కార్లలో పదిమంది ఇంజినీర్లు దిగారు. దాంతో పిల్లలను ఆ ఇంజినీర్ల దగ్గరకు తీసుకువెళ్లి, మీరు బాగా చదువుకొని వీళ్ళలా గొప్ప ఇంజినీర్లు కావాలని తిరుపతి చెప్పాడు.

అంతలోనే ఆ ఇంజినీర్లందరూ 'మాస్టర్ నమస్కారం' అంటూ తిరుపతికి కాళ్లకు నమస్కారం చేశారు. అందరూ.. 'నేను మీ స్టూడెంట్​నే' అని చెప్పారు. 'మీరు బాగా చదువు చెప్పడం వల్లే మేము ఇంజినీర్లు అయ్యాం' అన్నారు. దాంతో తిరుపతి ఆనందానికి అవధుల్లేవు. తాను ఇంజినీర్ కాకపోయినా ఇంతమంది ఇంజినీర్లను తయారుచేసినందుకు సంతోషపడ్డాడు. అప్పటినుంచి ఎప్పుడూ తాను ఇంజినీర్ కాలేదని బాధపడలేదు.