అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని రాళ్ల దాడికి దారితీసింది. ఈ ఘటనలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి వాహనంపై కూడా రాళ్ల దాడి జరిగింది
వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన నామినేషన్ కార్యక్రమానికి వెళ్తుండగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. రాళ్ల దాడిలో కొన్ని కార్లు ధ్వంసమయ్యాయి. ఎంపీ మిథున్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపైనా దాడి జరగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితులు అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల తొలిరోజే పుంగనూరులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
