దుర్గమ్మకు అర కిలో బంగారంతో కిరీటం

 దుర్గమ్మకు అర కిలో బంగారంతో కిరీటం
  • 494 గ్రాముల బంగారు కిరీటం సమర్పించిన శ్రీకాకుళం దాతలు


 విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా దసరా శరన్నవరాత్రి  ఉత్సవాలు జరుగుతున్నాయి.   ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారికి  ఈ రోజు ( అక్టోబర్​ 15)  ఉదయం విశేష స్వర్ణ కానుక సమకూరింది.

 శ్రీకాకుళానికి  చెందిన భక్తులు  కూర్మినాయుడు,  పద్మావతమ్మ దంపతుల కుమారుడు  కె. దుర్గా శ్రీనివాస్ అమ్మవారికి  రూ. 75 లక్షల విలువైన దివ్య స్వర్ణ కిరీటాన్ని భక్తిప్రపత్తులతో సమర్పించారు.  
​ఎరుపు, నీలం, తెలుపు, పచ్చ రాళ్లతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దిన 494 గ్రాముల బరువు గల ఈ నవరత్న ఖచిత బంగారు కిరీటాన్ని దాతలు ఆలయ అధికారులకు అందజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దసరా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వి. త్రినాథరావు సంయుక్తంగా ఈ కానుకను స్వీకరించారు.  

​అనంతరం దాత కుటుంబ సభ్యులకు అంతరాలయంలో శ్రీ అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం పలకగా, అధికారులు శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

​ఈ సందర్భంగా దాత  కె. దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ.. లోకపావని అయిన కనకదుర్గమ్మ దయవల్లే తాము ఈ కానుకను సమర్పించుకోగలిగామని, పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల పర్వదినాల్లో అమ్మవారికి స్వర్ణ కిరీటం బహూకరించే భాగ్యం కల్పించినందుకు ఆలయ ఈవోగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  
​