ఇస్లాంలోకి మారితే ముస్లిం కోటా కింద రిజర్వేషన్ వర్తించదు

ఇస్లాంలోకి మారితే ముస్లిం కోటా కింద రిజర్వేషన్ వర్తించదు

భారతీయ న్యాయ వ్యవస్థలో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. హిందూ మతం నుంచి ఇతర మతాలకు మారిన వ్యక్తులు.. కేవలం తాము పూర్వం అనుభవించిన కులం ఆధారిత రిజర్వేషన్లు క్లెయిమ్ చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలు వివాదం ఏమిటి?
తమిళనాడులో సీ జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం 2024 మార్చిలో ఒక కీలక ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం.. వెనుకబడిన తరగతులు (BC), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), డీ-నోటిఫైడ్ కమ్యూనిటీలు(DNC), షెడ్యూల్డ్ కులాల (SC) నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులను.. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం 'వెనుకబడిన తరగతి ముస్లింలు'(BCM)గా పరిగణించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం తమిళనాడులో ముస్లింల కోసం ప్రత్యేకంగా 3.5 శాతం రిజర్వేషన్ల కోటా అమలవుతోంది. అయితే.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇస్లాంలోకి మతం మారిన ముస్లింలకు ఈ విధంగా ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసిన మద్రాసు హైకోర్టు.. సీఎం విజయ్ సర్కార్ ఉత్తర్వులను కొట్టివేసింది. అయితే మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పుతో అక్కడ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు:
తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ తమిళనాడు ప్రభుత్వ అప్పీల్‌ను దేశ అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది.

కోర్టు కొన్ని అత్యంత కీలకమైన అంశాలను స్పష్టం చేసింది:
* మత మార్పిడి - ఆటోమేటిక్ రిజర్వేషన్ లేదు: హిందూ మతం నుంచి వేరే మతంలోకి మారినంత మాత్రాన.. ఆ కొత్త సామాజిక వ్యవస్థలో వారు అదే వెనుకబడిన కులానికి లేదా వర్గానికి ఆటోమెటిక్ గా సభ్యులుగా కొనసాగే అవకాశం లేదని కోర్టు తేల్చిచెప్పింది.

* రాజ్యాంగ నిబంధనలు: 1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు ప్రకారం.. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను కాకుండా వేరే మతాన్ని ఆచరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులాల(SC) జాబితాలో చేర్చడానికి వీలులేదని సుప్రీం కోర్టు గుర్తుచేసింది.

* పూర్వపు వెనుకబాటుతనం సరిపోదు: ఒక వ్యక్తి మతం మారకముందు అనుభవించిన సామాజిక వెనుకబాటుతనాన్ని లేదా కుల గుర్తింపును ప్రాతిపదికగా తీసుకుని.. మతం మారిన తర్వాత కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్ల కోసం అర్హులుగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ALSO READ : అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లండి.. 

సామాన్య ప్రజలకు ఈ తీర్పు అర్థం ఏమిటి?
చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే.. ఈ తీర్పు సామాన్య ప్రజలకు ఏ విధంగా వర్తిస్తుంది? ఒక వ్యక్తి తాను పుట్టిన కులంలో ఎదుర్కొన్న వివక్షను, సామాజిక వెనుకబాటును ఆధారం చేసుకుని.. వేరే మతంలోకి వెళ్లిన తర్వాత కూడా అదే రిజర్వేషన్ ప్రయోజనాలను పొందాలని కోరడం చట్టప్రకారం కుదరదని తాజా సుప్రీం కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. మతమార్పిడి అనేది కేవలం ఆధ్యాత్మిక, వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు.. అది వ్యక్తి సామాజిక హోదాను, చట్టపరమైన రిజర్వేషన్ హక్కులను కూడా మారుస్తుందని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా మతమార్పిడి రిజర్వేషన్ల అంశంపై ఒక స్పష్టమైన చట్టపరమైన క్లారిటీని అందిస్తోంది.