Team India ODI Squad: భారత క్రికెట్ జట్టు త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించబోతుంది. ఈ టూర్లో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్‌కు సంబంధించిన జట్టును బీసీసీఐ ప్రకటించగా.. ఇక వన్డే, టెస్ట్ సిరీస్‌ల ఎంపికపై వేగంగా కసరత్తు కొనసాగుతుంది. తుది జట్ల ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా బిగ్ హింట్ ఇచ్చేశాడు.
2, 3 రోజుల్లో వన్డే జట్టు ప్రకటన:
న్యూజిలాండ్‌తో జరిగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 4వ తేదీ నుంచి ఆక్లాండ్‌లో ప్రారంభం కానుంది. కాగా, ఈ వన్డే జట్టును వచ్చే రెండు లేదా మూడు రోజుల్లో బీసీసీఐ అధికారికంగా ప్రకటించనున్నట్లు బీసీసీఐ బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా వెల్లడించారు. నవంబర్ 19వ తేదీ నుంచి వెల్లింగ్టన్ వేదికగా ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జట్టును మాత్రం అక్టోబర్ చివరి నాటికి సెలక్ట్ చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్ హై-ప్రొఫైల్ మీటింగ్:
నేషనల్ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా, భారత్ వన్డే/టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లతో కలిసి నిన్న (2026, అక్టోబర్ 14, బుధవారం) హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజ్ఞాన్ ఓజా ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముగ్గురూ కలిసి భేటీ కావడం ఇదే మొదటిసారి.
టెస్ట్ జట్టు ఎంపిక ఆలస్యం ఎందుకంటే:
న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ జట్టు ప్రకటనలో జాప్యానికి ప్రధాన కారణం మన పేస్ బౌలర్ల ఫిట్నెసే. పేస్ దళం కీలక ఆటగాళ్లు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్నారు. వీరిద్దరూ అక్టోబర్ 24 లేదా 26 తేదీల్లో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిటర్న్ టు ప్లే (RTP) ఫిట్నెస్ టెస్టులకు హాజరుకానున్నారు. ఈ ఫిట్నెస్ పరీక్షల ఫలితాల ఆధారంగానే టెస్ట్ జట్టులో వారి ఎంపికపై సెలెక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
