వరంగల్ లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 2026 అక్టోబర్ 15న మంత్రి సీతక్కతో కలిసి వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. 24 అంతస్తుల ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం పూర్తి అయిందని చెప్పారు. అక్టోబర్ 20 నుంచి ఓపీ సేవలు ప్రారంభించబోతున్నామని అన్నారు.
విద్యా, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పిన మంత్రి.. హైద్రాబాద్ కు సమానంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే లక్ష్యం ఆస్పత్రి నిర్మించినట్లు చెప్పారు. దసరా రోజు సాఫ్ట్ లాంచింగ్ ఉంటుందన్నారు. ఎంజీఎం ఆసుపత్రికి అనేక జిల్లాల నుంచి వేలాది మంది రోగులు వస్తుంటారని తెలిపారు. ఈ ఆస్పత్రి ప్రారంభం తర్వాత అనేక ప్రభుత్వ ఆస్పత్రులు షట్ డౌన్ అవుతాయన్నారు.
అంతకు ముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు మంత్రులు పొంగులేటి, సీతక్క , ఎమ్మెల్యేలు అధికారులు. హాస్పిటల్ లో కొనసాగుతున్న పనుల గురించి మంత్రులకు వివరించారు అధికారులు.
వరంగల్ లో 11 వందల 53 కోట్ల రూపాయల వ్యయంతో 24 అంతస్తుల ఆస్పత్రి భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. 34 విభాగాల్లో వైద్య సేవల కోసం అధునాతన ఎక్యుప్మెంట్స్ ఏర్పాటు చేయనున్నారు. తొలుత మూడు అంతస్తులను ముందుగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
