ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్నేహపూర్వక పోటీ వద్దంటే వద్దని కూటమి పార్టీలు నిర్ణయించాయి.
ఇలా స్నేహపూర్వక పోటీ పేరుతో కూటమి పార్టీలు పోటీ పడటం ఏమాత్రం మంచి పరిణామం కాదని మూడు పార్టీలు భావిస్తున్నాయి. మూడు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేయాలని అధిష్టానాల నుంచి ఇప్పటికే కేడర్కు స్పష్టమైన సంకేతాలు అందాయి.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడంతో ఏపీలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలుత పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్బీ) ఎన్నికలు జరగనుండగా.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అలాగే, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల19న నోటిఫికేషన్ రిలీజ్ చేసి, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక అత్యంత కీలకమైన గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. నవంబర్ 26న మొదటి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుండగా, పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపడతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
