సీజేపీ నిరసనలో NDTV మహిళా జర్నలిస్ట్‎కు చేదు అనుభవం

సీజేపీ నిరసనలో NDTV మహిళా జర్నలిస్ట్‎కు చేదు అనుభవం

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇటీవల ఢిల్లీలో చేపట్టిన నిరసనల్లో ఓ ఎన్డీటీవీ మహిళా జర్నలిస్ట్‏కు చేదు అనుభవం ఎదురైంది. నిరసనలను లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా కొందరు సీజేపీ ప్రొటెస్టర్స్ ఆమె చుట్టూ చేరి గోడీ మీడియో అంటూ అవహేళన చేస్తూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీంతో సీజేపీ మద్దతుదారుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

వృత్తిలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మహిళా జర్నలిస్ట్‎ను టార్గెట్ చేసి వేధించడం సరికాదని చురకలంటిస్తున్నారు. పలువురు జర్నలిస్టులు ఈ ఘటనను ఖండిస్తూ బాధితురాలికి సంఘీభావం ప్రకటించారు. నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను బెదిరించడాన్ని విమర్శించారు. హేళనల మధ్య కూడా సంయమనంతో వృత్తిధర్మం పాటించిన జర్నలిస్ట్‎ను ప్రశంసించారు.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఎన్‌డీటీవి మహిళా జర్నలిస్ట్ తనుష్క దత్తా సీజేపీ నిరసనలను కవర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారుల గుంపు తనుష్క దత్తాను చుట్టుముట్టి గోడీ మీడియా అంటూ ఎన్డీటీవీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య కూడా తనుష్క సంయమనం కోల్పోకుండా ప్రశాంతంగా తన రిపోర్టింగ్‌ను కొనసాగించారు. సీజేపీ నిరసనకారులు తనుష్కను అవహేళన చేస్తోన్న దృశ్యాలను ఆమె కెమెరామెన్ రికార్డ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారడంతో సీజేపీ మద్దతుదారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

►ALSO READ | డ్రగ్స్ పై వ్యతిరేకంగా పోరాడుతుంటే చంపేస్తారా : రగిలిపోయిన జనం.. నిందితుడి ఇల్లు, షాపులు కూల్చివేత

ఎన్‌డీటీవి సీఈఓ, ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ కన్వాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వృత్తిలో భాగంగా తమ పని తాము చేసుకుంటున్న ఫీల్డ్ రిపోర్టర్లపై దాడి చేయడం, వారిని అడ్డుకోవడం లేదా దూషించడాన్ని ఆయన తప్పుబట్టరు. ఇలాంటి ప్రవర్తన నిరసనకారులు చేస్తున్న ఆశయాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. నిరసన తెలిపే హక్కు, దానిపై వార్తలు రాసే హక్కు రెండూ ముఖ్యమైన స్వేచ్ఛలేనని, ఈ రెండూ బెదిరింపులు లేదా దూషణల రూపంలో రాకూడదని అన్నారు. క్షేత్రస్థాయిలో శత్రుత్వాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రశాంతంగా తమ పనిని కొనసాగిస్తున్న ఎన్‌డిటివి రిపోర్టర్లను కన్వాల్ ప్రశంసించారు.