- రేగడి దోస్వాడ, తాళ్లపల్లిలో భూమి కేటాయింపు
- తమిళనాడు తరహాలోనే సమున్నతంగా ఆదియోగి విగ్రహం
- రెండు దశల్లో అభివృద్ధి.. అంతర్జాతీయ స్కూళ్లు, వెల్నెస్ సెంటర్లు
- 14 వేల మందికి ఉపాధి అవకాశాలు
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయస్థాయి పర్యాటక, ఆధ్యాత్మిక, వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కానున్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈశా ఫౌండేషన్ ఈ మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకోసం షాబాద్ మండల పరిధిలోని రేగడి దోస్వాడ, తాళ్లపల్లి గ్రామాల పరిధిలో 300 ఎకరాల భూమిని ప్రభుత్వం రూ.150 కోట్లకు సంస్థకు కేటాయించింది. ఈ క్యాంపస్‌కు ‘అబోడ్ ఆఫ్ యోగా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంటర్నేషనల్ యోగా సెంటర్’ అని నామకరణం చేశారు.
ఆధ్యాత్మికత, విద్య, ప్రకృతి ఆధారిత జీవనం కలబోతగా ఈ ఇంటిగ్రేటెడ్ సెంటర్‌ను నిర్మించనున్నారు. కోయంబత్తూరులోని ప్రధాన కేంద్రం తరహాలోనే ఇక్కడ కూడా ఆదియోగి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ సెంటర్ ఏర్పాటుతో దక్షిణ తెలంగాణ గ్లోబల్ స్పిరిచువల్ డెస్టినేషన్‌గా మారనుందని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు.
14 వేల మందికి ఉపాధి అవకాశాలు..
క్యాంపస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 14 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొదటి ఏడాదే కోటి మంది పర్యాటకులు వచ్చే చాన్స్ ఉందని చెప్తున్నారు. క్రమంగా రోజుకు సగటున 70 వేల చొప్పున ఏటా దాదాపు 2.55 కోట్ల మంది సందర్శకులు వస్తారని అంచనా. సందర్శకుల తాకిడితో స్థానికంగా ఏటా రూ.3 వేలకోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని భావిస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, వెల్నెస్ ప్రేమికుల కోసం రిసార్టులు, స్టార్ హోటళ్లు, హోమ్‌స్టేలు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో చెఫ్‌లు, హౌస్ కీపింగ్, టూర్ గైడ్లు, మేనేజ్మెంట్ నిపుణులకు డిమాండ్ పెరగనున్నది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ సిటీ నుంచి షాబాద్‌కు క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సులు, లోకల్ ట్యాక్సీ రవాణా వ్యవస్థ విస్తరించనుంది. క్యాంపస్ అవసరాల కోసం ఆర్గానిక్ కూరగాయలు, ఆవు పాలు, ప్రకృతి సాగు ఉత్పత్తులను స్థానిక రైతుల నుంచే సేకరించనున్నారు. సంప్రదాయ హస్తకళలు, పూజా సామగ్రి విక్రయ కేంద్రాల ద్వారా చేతివృత్తుల వారికి ఊతమివ్వనున్నది. యోగా శిక్షకులు, ఆయుర్వేద, నేచురోపతి థెరపిస్టులు, వైద్యులు, ఈశా విద్యా సంస్థల్లో టీచర్లు, అడ్మిన్ సిబ్బందికి ఉద్యోగాలు లభించనున్నాయి. క్యాంపస్ నిర్వహణ, సెక్యూరిటీ, అగ్రో-ఫారెస్ట్రీ విభాగాల్లో చుట్టుపక్కల గ్రామాల యువతకే
ప్రాధాన్యం దక్కనుంది.
భూముల ధరలకు రెక్కలు..
హైదరాబాద్ దక్షిణ-పశ్చిమ కారిడార్‌లో ఉన్న షాబాద్ ఇప్పటికే పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చందన్వెల్లి ఇండస్ట్రియల్ హబ్, అమెజాన్ డాటా సెంటర్లు, వెల్స్పన్ లాంటి దిగ్గజ పరిశ్రమలతోపాటు ఈశా ఫౌండేషన్ రాకతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో షాబాద్, చేవెళ్ల, శంకరపల్లి, మొయినాబాద్, పరిగి రోడ్లకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటివరకు వ్యవసాయ భూములుగా, ఫార్మ్ల్యాండ్స్గా ఉన్న ప్రాంతాలకు కమర్షియల్ డిమాండ్ ఏర్పడనుంది.
ప్రశాంతమైన జీవనశైలి, యోగా లైఫ్‌స్టైల్‌ను కోరుకునే సాఫ్ట్వేర్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సంపన్న వర్గాలు, ఎన్నారైలు షాబాద్ పరిసరాల్లో వీకెండ్ హోమ్స్, విల్లాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. దీంతో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలు, కన్వెన్షన్ సెంటర్లు, రిటైల్ మాల్స్ ఏర్పాటు కోసం ఇప్పటికే డెవలపర్లు షాబాద్ వైపు దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్ నేపథ్యంతో హైదరాబాద్ – బీజాపూర్ హైవే, ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ రోడ్ల విస్తరణ మరింత వేగవంతం కానుంది. దీంతో షాబాద్, చేవెళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి.
రెండు దశల్లో ప్రాజెక్టు విస్తరణ..
ఈ ప్రాజెక్టు కోసం ఈశా ఫౌండేషన్ దాదాపు రూ.900 కోట్లను పెట్టుబడిగా పెట్టి, రెండు దశల్లో విస్తరించనున్నారు. మొదటి దశ రూ.590 పైగా కోట్లతో ప్రాజెక్టు ప్రారంభ దశలోనే ఆధ్యాత్మిక మౌలిక వసతులు, ఆదియోగి విగ్రహం, వెల్కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈశా హోమ్ స్కూల్, రెసిడెన్షియల్ సదుపాయాలు, అగ్రో ఫారెస్ట్రీ ప్రాజెక్టులు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
రెండో దశలో రూ.160 కోట్లతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు ఈశా విద్య పాఠశాల, ప్రోగ్రామ్ హాళ్లు, కల్చరల్ అండ్ వెల్నెస్ హబ్‌లు, ఫుడ్ కోర్టులు, సందర్శకుల కోసం అదనపు వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభమైన నాలుగేళ్ల తర్వాత కార్పొరేట్, అంతర్జాతీయ నాయకత్వ లక్షణాలను పెంపొందించే అత్యాధునిక ‘గ్లోబల్ లీడర్షిప్ అకాడమీ’ని సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు.
