కేంద్ర మంత్రి పదవికి డాక్టర్ ఎల్. మురుగన్ రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి డాక్టర్ ఎల్. మురుగన్ రాజీనామా

న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష ఇండియా కూటమి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న వేళ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తన పదవికి రాజీనామా చేశారు. 

ఈ మేరకు ప్రధాని మోడీకి రాజీనామా లేఖను పంపించారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా మురుగన్ రిజైన్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంగళవారం (అక్టోబర్ 13) ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. 2029 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి పూర్తిగా సమయం కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

తమిళనాడులో బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కలిసి మళ్లీ పని చేస్తానని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ మాతకు, తమిళనాడుకు సేవ చేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని మురుగన్ పేర్కొన్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి కేంద్ర మంత్రివర్గంలో పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప అదృష్టమన్నారు.

మురుగన్ పొలిటికల్ కెరీర్:

మోడీ 3.0 కేబినెట్‎లో డాక్టర్ ఎల్. మురుగన్ సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2017 నుంచి 2020 వరకు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ తమిళనాడు యూనిట్ అధ్యక్షుడిగా కూడా మురుగన్ సేవలందించారు. 

మరోసారి కేబినెట్ విస్తరణ ప్రచారం

కేంద్ర మంత్రి మురుగన్ రాజీనామాతో కేంద్ర కేబినెట్ విస్తరణ ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాని మోడీ తన కేబినెట్‎ను పునర్వ్యవస్థీకరించనున్నట్లు గత కొన్ని రోజులుగా ఢిల్లీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో జెన్ జెడ్ నిరసనలు, 2029 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యువతకు మరింత చేరువయ్యేందుకు పలువురు సీనియర్లను పక్కన పెట్టి కేబినెట్‎లోకి యువ నాయకులను తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది.