ఆంధ్రాలో మొత్తం 123 స్థానిక సంస్థలకు గానూ 100 లోకల్ బాడీలకు ఏపీ ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు.
ఈ జాబితాలో శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లను ఉండగా.. ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, బాపట్ల, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ జారీ చేయకపోవడం గమనార్హం.
కోర్టు కేసుల కారణంగా ఈ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించలేదని తెలిసింది. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ ప్రకటించడంతో మరోసారి ఆంధ్రాలో రాజకీయం వేడెక్కింది.
►ALSO READ | జనసేనలోకి వంగవీటి రాధా..విజయవాడ మేయర్ రేసులో..!
స్థానిక ఎన్నికలను ఏపీలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జనసేన, టీడీపీ మధ్య పొత్తు పంపకాలు హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంది. పుర పోరు, పల్లె పోరు ఆంధ్రాను ఎన్నికల రణ క్షేత్రంగా మార్చేశాయి. ఏపీలో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించేసింది.
