- సిటీ హోటళ్లపై ‘టీజీ సేఫ్’ దాడులు
- నాలుగు ప్రముఖ హోటల్స్ లైసెన్సుల సస్పెన్షన్
- ఐఏసీజీ హాస్టల్ మెస్ బంద్.. ఏడు రెస్టారెంట్లకు షోకాజ్
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టల్ మెస్‌ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. రూల్స్ పాటించని నాలుగు హోటళ్ల లైసెన్సులను సస్పెండ్ చేసి, వ్యాపారాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఈ లిస్ట్ లో చిక్కడపల్లిలోని ఎన్ఆర్ఎస్ నందిని సుధ, వెంగళరావునగర్‌లోని సాయి దర్శిని, యూనివర్సల్ రెస్టారెంట్‌తో పాటు అమీర్‌పేట్‌లోని హర్ష డీలక్స్ మెస్ ఉన్నాయి. హర్ష డీలక్స్ మెస్ లో కస్టమర్ల తాగే వాటర్ డిస్పెన్సర్లోనే చనిపోయిన బొద్దింకలు తేలడం అధికారులను సైతం షాక్‌కు గురిచేసింది. కిచెన్ డ్రైనేజీ బ్లాక్ అయి ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం, లేబుళ్లు లేని ముడి పదార్థాలను అస్తవ్యస్తంగా పడేయడాన్ని గుర్తించారు. చిక్కడపల్లిలోని ఎన్ఆర్ఎస్ నందిని సుధ కిచెన్ లో తీవ్ర దుర్వాసన వచ్చింది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, కీటకాలు కనిపించాయి.
వెంగళరావు నగర్‌లోని యూనివర్సల్ రెస్టారెంట్ లో ఎలుకల సంచారం, జిడ్డు పట్టిన ఎగ్జాస్ట్‌లు, ఫ్రిజ్‌లో కుళ్లినట్లుగా ఉన్న అన్‌లేబుల్డ్ ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు. పక్కనే ఉండే సాయి దర్శిని హోటల్లో పగిలిన నేలపై మురుగు నిలవడం, గోడల పగుళ్లు, సిబ్బందికి హెల్త్ రికార్డులు లేకపోవడంతో లైసెన్స్ నిలిపివేశారు. మరోవైపు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐఏసీజీ హాస్టల్ మెస్ (పద్మశ్రీ క్యాంటీన్) లైసెన్స్ లేకపోవడం, అపరిశుభ్రంగా ఉండడంతో బంద్ చేయించారు. రూల్స్బ్రేక్చేసిన హఫీజ్ పేట్‌లోని ఇంపీరియల్ మల్టీకుజిన్, మాదాపూర్‌లోని కోల్‌కతా హౌస్, ఆవునా రెస్టారెంట్,రాజుగారి బిర్యానీ,..అమీర్‌పేట్‌లోని ఆనందోబ్రహ్మ, రాయలసీమ రుచులు రెస్టారెంట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అబ్సల్యూట్ బార్బెక్యూ రెస్టారెంట్‌కు లోపాలు సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇచ్చారు.
