సింగరేణి నిర్వీర్యం బీఆర్ఎస్ పాపమే..పదేండ్లలో ఒక్క కొత్త బ్లాక్ తీసుకు రాలే: భట్టి

సింగరేణి నిర్వీర్యం బీఆర్ఎస్ పాపమే..పదేండ్లలో ఒక్క కొత్త బ్లాక్ తీసుకు రాలే: భట్టి
  • 141 బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వేలంలో పాల్గొనక పోవడంతో సంస్థకు తీవ్ర నష్టం
  • అధికారంలో ఉండి చేయలేనోళ్లు ప్రతిపక్షంలో ఏం చేస్తరు
  • హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సమాధానం చెప్పాలి
  • వాళ్ల హయాంలోనే రూ.29 వేల కోట్ల బకాయిలు 
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు ధ్వజం
     

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. సంస్థ లాభాలు తగ్గడానికి గత ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన కారణమని ఆరోపించారు. మంగళవారం ప్రజాభవన్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు బీఆర్‌‌ఎస్‌‌పై విరుచుకుపడ్డారు. గత పదేళ్లలో కొత్త బొగ్గు బ్లాక్‌‌లను సాధించడంలో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్రం నిర్వహించిన సుమారు 141 బొగ్గు బ్లాక్‌‌ల వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేయడం వల్లే సంస్థకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. దీంతో సంస్థ వ్యాపార విస్తరణకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఇప్పటికే దాదాపు 14 బ్లాక్‌‌లు మూతపడ్డాయని, వాటి స్థానంలో కొత్తవి లేకపోవడంతో ఉత్పత్తి, ఆదాయంపై ప్రభావం పడుతోందని వివరించారు. ఏ మైనింగ్ సంస్థ అయినా నిరంతరం కొత్త బ్లాక్‌‌లు సాధిస్తేనే నిలదొక్కుకుంటుందని, ఆ పని బీఆర్‌‌ఎస్ చేయలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తాడిచెర్ల-2, కోయగూడెం బ్లాక్-3, మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్, నైని వంటి బ్లాక్‌‌లపై దృష్టి సారించామని తెలిపారు.

బకాయిల భారం వారిదే

విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు బీఆర్‌‌ఎస్ హయాంలోనే సుమారు రూ.29 వేల కోట్లకు పేరుకుపోయాయని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం మిగిల్చిన ఈ బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం సాధ్యం కాకపోయినా, జెన్‌‌కో, ట్రాన్స్‌‌కో నుంచి దశలవారీగా చెల్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పోరుబాట హాస్యాస్పదం

పదేండ్లు అధికారంలో ఉండి సింగరేణిని భ్రష్టు పట్టించిన బీఆర్‌‌ఎస్ ఇప్పుడు పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని మంత్రి శ్రీధర్‌‌బాబు ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండి పరిష్కరించలేని సమస్యలను ప్రతిపక్షంలో ఉండి ఎలా పరిష్కరిస్తారో మాజీ మంత్రి హరీశ్‌‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్లలో సింగరేణికి చేసిన మేలేమిటో, కార్మికుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారో ముందుగా పోరుబాటలో వివరించాలని సూచించారు.

మారుపేర్ల సమస్యను పదేళ్ల పాలనలో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌‌లో ఉన్న డిస్మిస్డ్ ఉద్యోగుల సమస్యలతోపాటు పలు సంక్షేమ అంశాలపై తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని శ్రీధర్‌‌బాబు తెలిపారు. కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించాల్సింది పోయి అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదని బీఆర్‌‌ఎస్ నాయకులకు హితవు పలికారు. సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.