గ్రానైట్‌‌‌‌పై టన్నుల లెక్కనే సీనరేజ్ ఫీజు..క్యూబిక్ మీటర్ కొలత బంద్

గ్రానైట్‌‌‌‌పై టన్నుల లెక్కనే సీనరేజ్ ఫీజు..క్యూబిక్ మీటర్ కొలత బంద్
  • నవంబర్ 1 నుంచి అమల్లోకి.. గనుల శాఖ ఉత్తర్వులు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రానైట్ తవ్వకాలు, విక్రయాలపై వసూలు చేసే సీనరేజ్ ఫీజు విధానంలో ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్‌‌‌‌లపై ఇప్పటివరకు కొనసాగుతున్న ‘క్యూబిక్ మీటర్’ కొలత పద్ధతిని పూర్తిగా ఎత్తివేస్తూ, కేవలం ‘మెట్రిక్ టన్ను’ బరువు ప్రాతిపదికన సీనరేజ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు మినరల్ కన్సెషన్ రూల్స్–1966లోని రూల్-10, షెడ్యూల్-1 కింద గల 13, 14 సీరియల్ నంబర్లకు సవరణలు చేస్తూ గనుల శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఉన్న గ్యాంగ్‌‌‌‌సా సైజుల వర్గీకరణను తొలగించి, రవాణా గమ్యస్థానాన్ని బట్టి ‘ఎక్స్‌‌‌‌పోర్ట్’, ‘డొమెస్టిక్’ పేరిట కొత్త ఫీజులను ఖరారు చేశారు. ఈ సవరణ ఉత్తర్వులు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రానైట్ వ్యాపారంలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా అడ్డుకట్ట పడనుంది.

డొమెస్టిక్‌‌‌‌కు రూ. 1,252..

కొత్త నిబంధనల ప్రకారం బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్‌‌‌‌లకు సంబంధించి మెట్రిక్ టన్నుకు వసూలు చేసే సీనరేజ్ ఫీజుల వివరాలను ప్రభుత్వం నిర్దిష్టంగా ఖరారు చేసింది. బ్లాక్ గ్రానైట్ ఎగుమతి (ఎక్స్‌‌‌‌పోర్ట్) విభాగానికి మెట్రిక్ టన్నుకు రూ.1,633 సీనరేజ్ ఫీజుగా నిర్ణయించగా, స్థానిక వినియోగం (డొమెస్టిక్) కింద మెట్రిక్ టన్నుకు రూ.1,252 ఫీజుగా నిర్దేశించారు. ఇక కలర్ గ్రానైట్ విషయానికొస్తే.. ఎక్స్‌‌‌‌పోర్ట్ విభాగానికి మెట్రిక్ టన్నుకు రూ.1,354, అలాగే డొమెస్టిక్ కేటగిరీ కింద మెట్రిక్ టన్నుకు రూ.1,176 రుసుము వసూలు చేయనున్నారు. 

నిబంధనలు కఠినం.. 

గ్రానైట్ బ్లాకుల తరలింపులో పన్ను ఎగవేతలకు తావులేకుండా ‘డొమెస్టిక్’, ‘ఎక్స్‌‌‌‌పోర్ట్’ వర్గీకరణను ప్రభుత్వం స్పష్టంగా నిర్వచించింది. ఇతర రాష్ట్రాలకు తరలించినా, లేదా విదేశాలకు ఎగుమతి చేసినా ఆ గ్రానైట్‌‌‌‌ను ‘ఎక్స్‌‌‌‌పోర్ట్’ కింద లెక్కించి అధిక రుసుము వసూలు చేస్తారు. రాష్ట్ర పరిధిలోనే వినియోగించే గ్రానైట్‌‌‌‌ను మాత్రమే ‘డొమెస్టిక్’ కేటగిరీగా గుర్తిస్తారు. 

మరిన్ని వార్తలు