- గోవుకు సాంస్కృతిక జంతువు హోదా ఇవ్వాలి
- పశుగణాభివృద్ధి సంస్థ పాలకవర్గం తీర్మానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పశుసంపద నాణ్యతను పెంచడం, పాల ఉత్పత్తిని విస్తరించడం, గో సంరక్షణకు ప్రాధాన్యమివ్వడం లక్ష్యంగా తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ (టీజీఎల్‌డీఏ) పలు కీలక తీర్మానాలు చేసింది. టీజీఎల్‌డీఏ చైర్మన్ డాక్టర్ సింగం చరణ్ కౌశిక్ యాదవ్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ప్రత్యేక బ్రీడింగ్ పాలసీ రూపకల్పనతోపాటు, గో ప్రొటెక్షన్ కమిషన్ ఏర్పాటు, గోవును తెలంగాణ సాంస్కృతిక జంతువుగా గుర్తించడం వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో పశుగణ సంపద నాణ్యతను మెరుగుపరిచేందుకు శాస్త్రీయ విధానాలతో కూడిన ప్రత్యేక బ్రీడింగ్ పాలసీని రూపొందించి అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పశుసంపద అభివృద్ధికి ప్రత్యేక విధానం లేకపోవడంతో ఈ దిశగా చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. పశుసంవర్ధక రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేసేందుకు మక్తల్ నియోజకవర్గంలో టీజీఎల్‌డీఏ ఆధ్వర్యంలో కృత్రిమ గర్భధారణ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పాల ఉత్పత్తి పెంపునకు ప్రాధాన్యం
రాష్ట్రంలో పాల కొరతను అధిగమించి, ఇతర ప్రాంతాల నుంచి పాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కృత్రిమ గర్భధారణ సేవలను విస్తృతం చేయాలని సమావేశం తీర్మానించింది. పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తిని మెరుగుపరచడంపై దృష్టి సారించింది. కంసానపల్లిలోని ఫ్రోజెన్ సీమెన్ బుల్ స్టేషన్ (ఎఫ్‌ఎస్‌బీఎస్)ను త్వరలోనే పూర్తిస్థాయి ఉత్పత్తి కేంద్రంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
గో సంరక్షణకు ప్రత్యేక కమిషన్
గోవుల రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేకంగా గో ప్రొటెక్షన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సమావేశం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా గోమాత ఉత్సవాన్ని నిర్వహించాలని, తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో భాగంగా గోవును ‘తెలంగాణ సాంస్కృతిక జంతువు’గా గుర్తించాలని తీర్మానించింది.
ఏరియా స్థాయిలో సేవల విస్తరణ
పశుసంవర్ధక సేవలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థంగా అందించేందుకు ప్రస్తుతం ఉన్న జిల్లా లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీల (డీఎల్‌డీఏ స్థానంలో ఏరియా లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీలను (ఎఎల్డీఏ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే టీజీఎల్‌డీఏ, డీఎల్డీఏలకు చెందిన భూములు, ఇతర ఆస్తులను ఆక్రమణల నుంచి రక్షించేందుకు కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని తీర్మానించింది. విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ రాజేశ్వర్, పీవీఎన్ఆర్ వెటర్నరీ యూనివర్సిటీ పరిశోధన విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ హరికృష్ణ, టీజీఎల్‌డీఏ సీఈవో డాక్టర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
