- పర్యాటక మౌలిక సదుపాయాలు, పురావస్తు కట్టడాల పరిరక్షణ కోసం రూ. 4.26 కోట్లు మంజూరు
- కంబోడియా, థాయ్లాండ్, భారత దేశ బౌద్ధ భిక్షువులు, నిపుణులతో మాస్టర్ ప్లాన్ పై చర్చలు
ఖమ్మం/ నేలకొండపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంగళవారం ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, పురావస్తు కట్టడాల పునరుద్ధరణపై కంబోడియా, థాయ్లాండ్, భారత దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, నిపుణుల సలహాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన తవ్వకాల్లో వెలుగు చూసిన మహాస్తూపం, బౌద్ధ విహారాల అవశేషాలను శాస్త్రీయ పద్ధతిలో పరిరక్షించి, వచ్చే ఒకటిన్నర సంవత్సరంలో దీన్ని దేశంలోని టాప్-3 బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.అభివృద్ధి పనుల ప్రణాళిక రూపకల్పన కోసం పురావస్తు శాఖ సంచాలకులతో పాటు బౌద్ధ ధర్మ నిపుణులు శివనాగిరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ ఉపేంద్ర రెడ్డి, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులతో కూడిన ఒక నిపుణుల కమిటీ (కోర్ టీమ్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి మాట్లాడుతూహెరిటేజ్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో సందర్శకుల మార్గాలు, ప్రాంగణ సుందరీకరణ, సమాచార సూచికలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వైటీపీఎస్, తెలంగాణ జెన్ కో నిధులతో రూ. 1.76 కోట్లతో ప్రాచీన బౌద్ధ విహారాలు, సమావేశ మందిరాల పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
నిర్మాణ శైలి దెబ్బతినకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఈ పరిరక్షణ పనులు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ పీవీ శ్రీనివాస రావు, హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు డా. పి. నాగరాజు, ఎన్. నరసింగ్, సూపరింటెండెంట్ ఎ. రాజు, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి రవి బాబు, నేలకొండపల్లి మండల తహసీల్దార్ రాంప్రసాద్, సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
