అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు.. కలలో కూడా ఊహించని పరిస్థితులు మన తెలుగు టెక్కీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అగ్రరాజ్యంలో స్థిరపడాలని, తమ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించాలని కలలు కన్న ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు సాఫ్ట్‌వేర్ నిపుణులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. అమెరికాలో ఉంటూ భారీ వేతనాలు అందుకున్నవారే ఇప్పుడు సర్వస్వం కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో రాత్రికి రాత్రే భారత్‌కు తిరిగి వస్తుండటం టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఉద్యోగాలు కోల్పోవడం, H-1B వీసా రూల్స్ కఠినంగా మారడం, మరోవైపు I-140 పిటిషన్లు తిరస్కరించబడటంతో చాలా మందికి అమెరికాలో ఉండటానికి చట్టపరమైన అవకాశాలు లేకుండాపోతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ పరిస్థితులకు నిదర్శనం. డల్లాస్‌లో ఇంకా 8 నెలల హోమ్ లీజు గడువు ఉన్నప్పటికీ, ఐ-140 తిరస్కరించబడిన మరుక్షణమే భారత్‌కు తిరిగి వచ్చేయాల్సి వచ్చిందట. అక్కడ ఉంటే నెలకు 1,800 డాలర్ల అద్దె కట్టాల్సి రావడం, కనీసం అమ్మేందుకు వీలుపడక పోవడంతో కార్లను స్క్రాప్‌యార్డ్‌కు తరలించి, విలువైన వస్తువులను చెత్తలో పడేసి ప్రాణభయంతో ఇండియా ఫ్లైట్ ఎక్కేశానని చెప్పారు తెలుగు టెక్కీ. ఒకప్పుడు అమెరికాలో ఏడాదికి కోటి వేతనంగా అందుకున్న తెలుగు టెక్కీ ప్రస్తుతం హైదరాబాదులో రూ.35 లక్షల ప్యాకేజీతో సరిపెట్టుకున్నారు.
ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న పరిస్థితులు 2008 ఆర్థిక మాంద్యాన్ని తలపిస్తున్నాయని ప్రవాస సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ అనంతర బూమ్ సమయంలో ఎగబడి అమెరికాలో ఇళ్లు కొన్న టెక్కీలు, ఇప్పుడు పెరిగిన వడ్డీ రేట్ల దెబ్బకు విలవిల్లాడుతున్నారు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 4 శాతం నుంచి ఏకంగా 7.5 శాతానికి పైకి చేరటంతో పాటు, విపరీతమైన ద్రవ్యోల్బణం, పెరిగిన హోమ్ లోన్ భారంతో ఇళ్ల అమ్మకాలు పడిపోయాయి. కొత్త ఇళ్ల నుంచి పోటీ ఉండటం, ఉద్యోగాలు లేకపోవడంతో చాలామంది తమ ప్రాపర్టీలను అమ్ముకోలేక ఫోర్‌క్లోజర్ చేయడం లేదంటే ఇళ్లను గాలికి వదిలేసి రావడమో చేస్తున్నారు.
టెక్సాస్‌లోని డల్లాస్-ఫార్త్ వర్త్, సెలీనా, ఫ్రిస్కో, కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఒక్క ఇల్లు మాత్రమే కాకుండా లాభాల ఆశతో రెండు, మూడు ఆస్తులు కొనుగోలు చేసిన అనుభవజ్ఞులైన టెక్కీలు సైతం ఇప్పుడు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. మార్కెట్‌లో ఇళ్ల ధరలు ఏకంగా 30 శాతం వరకు పడిపోవడంతో కొనుగోలుదారులు కరువయ్యారు. అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావనతో పాటు, ఆర్థిక అనిశ్చితి భారతీయ టెక్కీలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు నెలకు లక్షల రూపాయల సంపాదనతో విలాసవంతమైన జీవితం గడిపిన వారు.. ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ బాట పట్టడం తలకిందులైన వారి జీవిత కష్టాలకు అద్దం పడుతోంది.
