మద్రాసు హైకోర్టు ఇటీవల వెలువరించిన ఒక కీలక తీర్పు వైవాహిక బంధంలో పిల్లలు కలగకపోవడాన్ని కేవలం ఒక నేరంగా లేదా భార్య చేసిన తప్పుగా చూడలేమని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13(1)(ia) ప్రకారం.. సంతానం కలగకపోవడమనేది భార్య వైఫల్యంగా భావించి, దానిని భర్తపై మానసిక క్రూరత్వంగా ఆపాదించడానికి వీలుపడదని హైకోర్టు తేల్చిచెప్పింది. వివాహం అనేది కేవలం సంతానోత్పత్తి కోసమే కుదిరేది కాదని, కేవలం పిల్లలు లేరన్న కారణంతో భాగస్వామి వైవాహిక బంధంలో విఫలమయ్యారని చెప్పలేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
చెన్నైకి చెందిన ఓ దంపతుల కేసులో భర్త తనకు విడాకులు కావాలని కోరారు. తమ వివాహం జరిగి చాలా ఏళ్లయినా పిల్లలు కలగలేదని, భార్య తనను పబ్లిక్‌గా దూషించిందని, చెప్పుతో కొట్టిందని ఆరోపించారు. అయితే భార్య మాత్రం తాను వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించానని, గర్భాశయంలో 8 సెం.మీ ఫైబ్రాయిడ్ సమస్య ఉన్నప్పటికీ చెన్నైలో శస్త్రచికిత్స, కష్టమైన ఫెర్టిలిటీ చికిత్సలు, హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నానని కోర్టుకు తెలిపింది. సంతానం కోసం ఆమె పడిన శారీరక, మానసిక వేదనను కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ALSO READ : పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనండి..
ఫెర్టిలిటీ చికిత్స అనేది కేవలం ఒక సాధారణ వైద్య ప్రక్రియ కాదని, అందులో రోజూ జరిగే స్కానింగ్‌లు, రక్త పరీక్షలు, ఇంజెక్షన్ల వల్ల మహిళలు తీవ్రమైన శారీరక ఇబ్బందులు, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటారని ధర్మాసనం పేర్కొంది. భార్య స్వయంగా కష్టపడి ఈ చికిత్సలు చేయించుకోవడం అనేది ఆమె కాపురం నిలబెట్టుకోవాలనే తపనకు నిదర్శనమే తప్ప, క్రూరత్వం కిందకు రాదని స్పష్టం చేసింది. భర్త చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేకపోవడంతో.. ఆయన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది.
సుప్రీంకోర్టు న్యాయవాది అమిత్‌రాజ్ కౌశల్ మాట్లాడుతూ.. కేవలం పిల్లలు కలగలేదన్న ఒక్క కారణంతో ఎవరూ విడాకులు పొందలేరని, చట్టపరంగా భర్త తన వాదనను గట్టి ఆధారాలతో నిరూపించుకోవాలని స్పష్టం చేశారు. ఈ తీర్పు ప్రకారం సంతానలేమిని, వైద్య చికిత్సల వైఫల్యాన్ని కేవలం మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి.
