- క్యూ2లో 21 శాతం పెరిగిన నికర లాభం
- రెవెన్యూ రూ.35,620 కోట్లు
- షేరుకి రూ.12 డివిడెండ్
- రూ.2,100 కోట్లకు చేరిన ఏఐ రెవెన్యూ
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ అదిరిపోయే రిజల్ట్స్ ప్రకటించింది. కంపెనీ నికర లాభం ఈ ఏడాది జులై– సెప్టెంబర్ (క్యూ2) క్వార్టర్‌లో రూ.5,132 కోట్లకు చేరుకోగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.4,626 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం, కిందటేడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ.4,235 కోట్లతో పోలిస్తే 21.18 శాతం ఎక్కువ. కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.31,942 కోట్ల నుంచి 11.5 శాతం పెరిగి రూ.35,620 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో రూ.34,579 కోట్ల ఆదాయం సాధించింది. క్యూ2 లో హెచ్‌సీఎల్ టెక్ ఏఐ రెవెన్యూ భారీగా పెరిగింది. క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే ఈ విభాగం ఆదాయం 28.4 శాతం పెరిగి 219 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్ల) కు చేరగా, ఏడాది లెక్కన 78 శాతం వృద్ధి నమోదైంది. ఒక్కో షేరుకి రూ.12 ఇంటెరిమ్ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. హెచ్‌సీఎల్ షేర్లు సోమవారం 0.50 శాతం పెరిగి రూ.1,223 వద్ద సెటిలయ్యాయి.
ఆంత్రోపిక్‌తో భాగస్వామ్యం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిప్‌తో హెచ్‌సీఎల్ భారీ అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఎంటర్ప్రైజ్క్లయింట్ల కోసం ఆంత్రోపిక్ డెవలప్ చేసిన ఏఐ మోడల్ 'క్లాడ్' ఆధారంగా 'ఏజెంటిక్ ఏఐ' పరిష్కారాలను అందించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఉద్యోగుల అవసరం పెద్దగా లేకుండా సొంతంగా పనిచేసే 'ఏజెంటిక్ ఏఐ' వ్యవస్థలను కంపెనీలు వాడడంలో ఈ బిజినెస్ యూనిట్ సాయం చేస్తుంది.
సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ, గవర్నెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (సీఓఈ)ను కూడా ఏర్పాటు చేసి, తమ ఇంజనీర్ల ద్వారా క్లయింట్లకు సేఫ్ టెస్టింగ్ వాతావరణాన్ని అందించనుంది. హెచ్‌సీఎల్ టెక్ సర్వీసెస్ విభాగాలు క్లాడ్, క్లాడ్ కోడ్ మోడళ్లను ఉపయోగించి ఇండస్ట్రీల వారీగా సొల్యూషన్లను రూపొందిస్తాయి. అలాగే హెచ్‌సీఎల్ సాఫ్ట్‌వేర్ విభాగం తమ కీలక ఉత్పత్తులైన హెచ్‌సీఎల్ బిగ్‌ఫిక్స్, హెచ్‌సీఎల్ యాప్‌స్కాన్‌లలో క్లాడ్‌ను జోడించనుంది. కంపెనీకి చెందిన ఏఐఫోర్స్ ప్లాట్‌ఫామ్‌లోనూ దీనిని యాడ్ చేసి ఐటీ సపోర్ట్, కోడ్ ఫిక్సింగ్ సేవలను అందించనున్నారు. నమ్మకం ఉన్నప్పుడే ఏఐ మరింత ప్రయోజనకరంగా పనిచేస్తుందని, బ్యాంకులు, ఆసుపత్రులు, తయారీ రంగాల్లోని అత్యంత సున్నితమైన నెట్‌వర్క్‌లను హెచ్‌సీఎల్‌టెక్ నిర్వహిస్తుండడంతో ఈ భాగస్వామ్యం కీలకమని ఆంత్రోపిక్ కో–పౌండర్, ప్రెసిడెంట్ డానియెలా
అమోడీ పేర్కొన్నారు.
రెవెన్యూ గైడెన్స్ పెంపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ వృద్ధి అంచనాలను హెచ్‌సీఎల్ స్వల్పంగా పెంచింది. గతంలో వేసిన 1 శాతం–4 శాతం నుంచి 2.5 శాతం–4 శాతానికి పెంచింది. కంపెనీ కొత్త డీల్స్ కూడా క్యూ2లో స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మొత్తం 3.24 బిలియన్ డాలర్ల (రూ.31,100 కోట్ల) విలువైన డీల్స్ దక్కించుకుంది. ఇందులో మెర్సిడెజ్ బెంజ్ నుంచి దక్కించుకున్న 1.14 బిలియన్ డాలర్ల ఏఐ డీల్ కూడా ఉంది. “అడ్వాన్స్డ్ ఏఐ రెవెన్యూ పెరుగుతుండడం చూస్తుంటే మా బిజినెస్ స్ట్రాటజీ సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ల ద్వారా ఫుల్ ఏఐ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. గ్లోబల్‌గా ప్రభుత్వాలకు, కంపెనీలకు నమ్మదగ్గ టెక్నాలజీ పార్టనర్‌గా హెచ్‌సీఎల్ ఎదిగింది” అని కంపెనీ చైర్‌పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా తెలిపారు.
