ద్రవ్యోల్బణం 5.54శాతం.. 21 నెలల గరిష్టానికి ఆహార ద్రవ్యోల్బణం..తెలంగాణలోనూ అత్యధికం

ద్రవ్యోల్బణం 5.54శాతం.. 21 నెలల గరిష్టానికి ఆహార ద్రవ్యోల్బణం..తెలంగాణలోనూ అత్యధికం

న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 5.54 శాతానికి పెరిగింది. ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని నేషనల్​ స్టాటిస్టిక్స్​ ఆఫీస్​ తెలిపింది. ఆగస్టులో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) 4.83 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.97 శాతం ఉండగా, సెప్టెంబర్ నాటికి 7.74 శాతానికి చేరింది. ఇది 21 నెలల గరిష్టం కావడం గమనార్హం.

ఉల్లి ధరలు అత్యధికంగా 108.09 శాతం పెరిగాయి. వెండి ఆభరణాలు 87.8 శాతం, అల్లం 62.85 శాతం, వెల్లుల్లి 54.62 శాతం,  నిమ్మకాయలు 36.41 శాతం ప్రియమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.08 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.88 శాతంగా నమోదైంది. తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల ఒత్తిడి ఎక్కువగా ఉంది.  రాబోయే రోజుల్లో వర్షాభావం వల్ల పంట దిగుబడులు తగ్గి ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత రిజర్వు బ్యాంక్ ఇటీవల తన కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది.