బంగారం కోసం భర్తతో కలిసి.. వృద్ధురాలిని హత్య చేసిన పనిమనిషి

బంగారం కోసం భర్తతో కలిసి.. వృద్ధురాలిని హత్య చేసిన పనిమనిషి

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి పట్టణంలో గత నెల 29న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. బంగారు నగల కోసం పనిమనిషే తన భర్తతో కలిసి వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని గంజ్ హైస్కూల్ సమీపంలో నివాసం ఉండే చిట్టిమల్ల అనసూయ (66), సుదర్శన్ దంపతుల ఇంట్లో బతుకమ్మ కుంటకు చెందిన బోసు రజిత నాలుగేండ్లుగా పనిమనిషిగా చేస్తోంది.

గత నెల 29న సాయంత్రం సుదర్శన్ గుడికి వెళ్లిన టైంలో రజిత తన భర్త నర్సింగ్​తో కలిసి అనసూయ ఇంటికి వచ్చింది. ఇంట్లో కరెంట్ ఆపేసిన అనంతరం పూజ చేసుకుంటున్న అనసూయను పక్క గదిలోకి లాక్కెళ్లి గొంతుకు టవల్ ను బిగించి హత్య చేశారు. తర్వాత మృతురాలి ఒంటిపై ఉన్న బంగారం పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి కమ్మలను తీసుకొని పారిపోయారు. గుడికి వెళ్లిన సుదర్శన్ తిరిగి ఇంటికి వచ్చే సరికి అనసూయ చనిపోయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనసూయను చంపిన తర్వాత రజిత తనపై అనుమానం రాకుండా పనిచేసేందుకు వస్తుండేది. వివిధ కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేయగా.. రజితే తన భర్తతో కలిసి అనసూయను హత్య చేసి నగలను ఎత్తుకుపోయినట్లు తేలింది. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి ఎనిమిది తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రజిత 2023లో భూమయ్య అనే వ్యక్తి ఇంట్లో సైతం పనిమనిషిగా చేస్తూ.. నాలుగు తులాల బంగారు నగలు ఎత్తుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, సీఐ నరహరి పాల్గొన్నారు.