గురుకులాన్ని నడిపే రాఘవయ్యకు చుట్టు పక్కల మంచి పేరు ఉంది. ఆయన ఒకసారి గురుకులం కోసం పాలిచ్చే ఒక ఆవును కొనాలని పొరుగూరు సంతకు వెళ్లాడు. కానీ... ఎంతో విచారంగా తిరిగి వచ్చాడు.'ఏమయ్యింది? గురువుగారూ' అని అడిగారు. ఆయనకు ఎదురొచ్చిన శిష్యులు రాము, సోము. "మంచి పాలిచ్చే ఆవును, దూడతో సహా అయిదు వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాను.
వస్తువులు కొనే పని మీద కాసేపు అలా వెళ్లొచ్చేసరికి ఆ వ్యాపారి మాట మార్చేశాడు. పదివేల రూపాయలకు తక్కువ అమ్మనన్నాడు. అటు పక్కగా మనం అంటే గిట్టని భూషయ్య కనిపించాడు. అతనే ఏదో చేసి ఉంటాడు' అన్నాడు రాఘవయ్య.'ఆవు దూడను ఎలాగైనా కొని తెస్తాం' అని వ్యాపారి వివరాలు, ఆవు ఆనవాళ్లు తెలుసుకుని, ఐదువేల రూపాయలు తీసుకుని సంతకు బయలుదేరారు రాము, సోములు,వాళ్లిద్దరూ సంతకు చేరుకున్నారు.
ముందుగా రాము ఆ వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. 'దూడ అమ్ముతావా?' అనడిగాడు.'దూడను ఒక్కదాన్నే ఎలా అమ్ముతాను? ఆవు, దూడను కలిపి పదివేలకు అమ్ముతాను' అన్నాడు వ్యాపారి.'నాకు దూడ మాత్రమే కావాలి. అయిదు వేలకు కొంటాను' అన్నాడు రాము. అప్పుడేఅక్కడికి వచ్చిన సోము వాళ్ల మాటలు విని, 'నాకు దూడ వద్దు ఆవు మాత్రమే కావాలి' నేను ఆవుకు అయిదువేల రూపాయలు ఇస్తాను' అన్నాడు.బేరం బాగా దొరికిందని వ్యాపారి మనసులో మురిసిపోయాడు. ఇద్దరికి రెండింటినీ అమ్మేందుకు ఒప్పుకున్నాడు. 'ఇప్పుడే డబ్బు తెస్తాను' అని చెప్పి సోము అక్కడి నుంచి జారుకున్నాడు.
రాము ఆ వ్యాపారికి అయిదువేల రూపాయలు ఇచ్చి... 'ఇప్పుడే చెప్తున్నాను. ఆవును నా వెంట రాకుండా చూసుకో వస్తే నాకు సంబంధం లేదు' అన్నాడు. "నేను పెంచిన ఆవు, నేను చెప్పినట్లే వింటుంది. నువ్వు దూడను తీసుకెళ్ళు' అన్నాడు వ్యాపారి.రాము దూడను మెల్లగా నడిపించుకుంటూ. తీసుకెళ్తున్నాడు. ఆవు "అంబా... అంబా" అని అరుస్తూ.. పలుగుకు కట్టిన తాడును పెనుగులాడి తెంపుకుని పరుగున దూడ దగ్గరకు చేరుకుంది. వెనకాల కర్రతో వ్యాపారి వెంటపడగా ఆవు అతణ్ణి కొమ్ములతో గాయపరిచింది.
అక్కడికి సోము వచ్చి 'నువ్వు ముందుగా మా గురువుగారికి ఐదువేల రూపాయలకు బేరం కుదుర్చుకుని, ఎవరో చెప్పిన మాటలు విని, మనసు మార్చుకుని ధరను పెంచావు. అందుకే మేం ఆవు, దూడలను తీసుకెళ్తున్నాం' అని చెప్పి... ఇద్దరూ వెళ్లిపోయారు. వ్యాపారి తను చేసిన తప్పు తెలుసుకుని బాధపడ్డాడు.ఆవు, దూడతో వచ్చిన రాము, సోములు జరిగింది గురువుగారికి చెప్పారు. వారు తెలివిగా ఆడిన నాటకం రాఘవయ్యను ఎంతో సంతోషింపజేసింది.
-
