హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం..5 కోట్ల నష్టం.!

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరు ఫర్నిచర్ షాపులు దగ్ధం..5 కోట్ల నష్టం.!

హైదరాబాద్ లోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖలీల్ హోటల్ సమీపంలోని ఫర్నిచర్ షాపుల్లో అక్టోబర్ 13న  తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే మంటలు వేగంగా వ్యాపించడంతో ఆరు ఫర్నిచర్ షాపుల్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. భారీగా ఆస్తి నష్టం సంభవించడంతో బాధిత షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని షాపుల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సంబంధిత సమస్యల కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏళ్ల తరబడి కష్టపడి వ్యాపారాలు నిర్వహించుకుంటున్న తమకు ఈ ప్రమాదంతో తీవ్ర నష్టం వాటిల్లిందని బాధిత వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.  ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టపోయిన వ్యాపారులకు తగిన పరిహారం అందించి, తిరిగి వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు సహాయం చేయాలని కోరుతున్నారు.

టప్పాచబుత్ర ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.