దేశీయ సాస్ సేవల దిగ్గజం జోహో ఉద్యోగులకు యాజమాన్యం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు సాధారణంగా ఇచ్చే శాలరీ హైక్స్ నిలిపివేస్తున్నట్లు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. పెరుగుతున్న ఖర్చులు, అనిశ్చిత వ్యాపార పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సాఫ్ట్‌వేర్ రంగాన్ని సవాళ్లు చుట్టుముట్టాయని, భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులను నివారించేందుకే తాము ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు శ్రీధర్ వెంబు తెలిపారు. గత 18 నెలలుగా కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచలేదని, మార్కెటింగ్ బడ్జెట్‌ను కూడా భారీగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. కేవలం ఉద్యోగ నియామకాలే కాకుండా.. కంపెనీ మనుగడను కాపాడుకునేందుకు ఖర్చుల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
AI సాంకేతికత కారణంగా వ్యాపార ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని వెంబు వివరించారు. ముఖ్యంగా డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన సర్వర్ల ధరలు ఏకంగా 4 రెట్లు పెరగడం, AI వినియోగం ఊహించని రీతిలో పెరుగుతుండటం కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని తెలిపారు. గతంలో కొత్త ఉద్యోగుల జీతభత్యాలకు వెళ్లే నిధులు ఇప్పుడు పూర్తిగా AI , డాటా సెంటర్ల మౌలిక వసతుల కోసమే ఖర్చు చేయాల్సి వస్తోందని స్పష్టం చేశారు.
అయితే ఈ సంక్షష్ట పరిస్థితిని జోహో ఉద్యోగులు అర్థం చేసుకుంటున్నారని, వారి సహకారానికి శ్రీధర్ వెంబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ ఒక సరికొత్త పునరుద్ధరణ దశలో ఉందని, రాబోయే మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలం జోహో భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకమని పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో వస్తున్న ఈ వేగవంతమైన మార్పులను ఎదుర్కొంటూ, సంస్థను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లేందుకు యాజమాన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
