ఈ ఏడాది (2026) దసరా పండుగ విషయంలో గందరగోళంగా ఉంది. ఎందుకంటే అక్టోబర్ 21న 'ఉదయ తిథి' (సూర్యోదయ సమయంలో ఉండే తిథి) ఉన్నప్పటికీ రావణ దహనానికి అవసరమైన 'ప్రదోష ముహూర్తం' 'విజయ ముహూర్తం' ఆ రోజున 'దశమి తిథి'తో కలిసి రావడం లేదు. అక్టోబర్ 20న సూర్యోదయ సమయంలో దశమి తిథి లేదు. ఈ పరిస్థితుల్లో దసరాను ఎప్పుడు జరుపుకోవాలి? రావణ దహనం, శమీ పూజ, ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి.. పండితులు ఏమంటున్నారు .. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
దసరా పండుగను హిందువులు చాలా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఇప్పటికే ( అక్టోబర్ 13 నాటికి) నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పురాణాల ప్రకారం చెడుపై మంచి విజయం సాధించిన రోజున విజయదశమి పండుగ జరుపుకుంటారు.
శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అయితే 2026లో దసరా పండుగ అక్టోబర్ 20న జరుపుకోవాలా? లేక అక్టోబర్ 21నా? అనే సందేహం చాలామందిలో ఉంది. ప్రాంతీయ పంచాంగాలు, సంప్రదాయాల ఆధారంగా ఈ తేదీల్లో తేడా కనిపిస్తోంది.
దసరా 2026 ఎప్పుడు?
పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ( 2026) దసరా పండుగను అక్టోబర్ 20న జరుపుకోవాలి. దశమి తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం ప్రారంభమై, అక్టోబర్ 21 మధ్యాహ్నం వరకు ఉంటుంది.
ఆశ్వయుజ శుక్ల పక్ష దశమి తిథి ప్రారంభం: అక్టోబర్ 20 మధ్యాహ్నం 12 :50 గంటలకు ఆశ్వయుజ శుక్ల పక్ష దశమి తిథి ముగింపు: అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2:11 గంటలకు
హిందువులు జరుపుకొనే పండుగలను తిథుల ఆధారంగా జరుపుకుంటారు. కొన్ని పండుగలు బ్రహ్మ ముహూర్తంలో ఉన్న తిథి ఆధారంగా చేపుకొంటే మరి కొన్ని పండుగలు ప్రదోష కాలం( సాయంత్రం) తిథి ఉన్న సమయంలో చేసుకోవాలి.
దసరా పండుగ విషయంలో అక్టోబర్ 20 ఉదయం దశమి తిథి ఉండదు. ప్రదోషకాలంలో మాత్రమే ఉంటుంది. ఆయుధపూజ, రావణదహనం, శమీపూజను సాయంత్రమే నిర్వహించాలి. అందుకే సాయంత్రం దశమి తిథి ఉన్న రోజు 20 వ తేదీ కాబట్టి ఆ రోజే పండుగను జరుపుకోవాలి.
విజయదశమి రోజున పూజలు, శుభకార్యాలు నిర్వహించడానికి విజయ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సమయంలో అపరాజితా దేవిని పూజించడం, శమీ వృక్షానికి పూజలు చేయడం వంటి సంప్రదాయాలు ఉన్నాయి.
