కుప్పం IAS అధికారి వికాస్ పై క్రిమినల్ కేసు : పబ్ లో పోలీసులతో గొడవ

కుప్పం IAS అధికారి వికాస్ పై క్రిమినల్ కేసు : పబ్ లో పోలీసులతో గొడవ

చిత్తూరు: కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదైంది. బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. రెసిడెన్సీ రోడ్డులో ఉన్న కావోర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఈ కేసు నమోదైంది.  

అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరులోని పబ్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తన నలుగురు స్నేహితులతో కలిసి బార్‌లో ఉన్నారు.  పబ్‌లో ఉన్న కస్టమర్ల వయసును ధ్రువీకరించేందుకు పోలీసులు గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్న సమయంలో వివాదం తలెత్తింది.

ఈ క్రమంలో పోలీసులతో వికాస్ మర్మత్ వాగ్వాదానికి దిగారని, వారితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు కూడా నదయ్యాయి. 

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌తో పాటు అభయ్, ఉదయ్ సింగ్, నితీష్, రోషన్ పేర్లు కూడా కేసులో ఉన్నాయి.   పబ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ చేస్తున్నారు.