నిపుణుల కమిటీకి నివేదించాలని ఈవో నిర్ణయం
కమిటీ సిఫార్సుల ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు
హైదరాబాద్, వెలుగు: ఆటో ఇమ్యూనల్, ఇతర అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ‘మెడికల్ కేసెస్’ కేటగిరీలో తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించడంపై టీటీడీ సానుకూలంగా స్పందించింది. సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసస్ (ఎస్ఎల్‌ఈ), స్క్లెరోడెర్మా, మల్టిపుల్ స్క్లిరోసిస్, అల్సరేటివ్ కోలైటిస్, క్రోన్స్ డిసీజ్, సికిల్‌సెల్ అనీమియా, తలసేమియా తదితర వ్యాధిగ్రస్తులకు ఈ సౌకర్యం కల్పించే అంశాన్ని నిపుణుల కమిటీకి నివేదించాలని టీటీడీ నిర్ణయించింది.
ప్రస్తుతం టీటీడీ ‘మెడికల్ కేసెస్’ కేటగిరీలో మూత్రపిండాల మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, డయాలసిస్, కాలేయ మార్పిడి, మెదడు ఆపరేషన్, క్యాన్సర్, నడవలేని స్థితికి దారితీసే స్పైన్ సర్జరీ బాధితులకు మాత్రమే ఆన్‌లైన్‌లో ప్రీ బుకింగ్ ద్వారా టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. ఆటో ఇమ్యూనల్, నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్–2021 కింద గుర్తించిన వ్యాధిగ్రస్తులకూ ఈ సౌకర్యం కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన ఏపీ హైకోర్టు న్యాయవాది ఎస్.కె. శ్రీకృష్ణ యశస్వి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది. టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్, స్విమ్స్ డైరెక్టర్-కమ్ వైస్ చాన్స్‌లర్‌ను నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో రవిచంద్ర ఆదేశించారు. మే 27న స్విమ్స్‌లో జరిగిన నిపుణుల సమావేశంలో వ్యాధుల రకాలు, తీవ్రత, వైకల్య స్థాయి వేర్వేరుగా ఉండటం, ఆన్‌లైన్‌లో వైద్య ధ్రువపత్రాల ధ్రువీకరణలో ఎదురయ్యే సమస్యల కారణంగా వెంటనే ఈ వ్యాధులను ‘మెడికల్ కేసెస్’ కేటగిరీలో చేర్చడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని మల్టీ డిసిప్లీనరీ ఎక్స్పర్ట్స్కమిటీకి నివేదించాలని ఈవో నిర్ణయించారు. కమిటీ సిఫార్సుల ఆధారంగా టీటీడీ తదుపరి చర్యలు తీసుకోనుంది.
