ఓట్లు పోయినోళ్లను ఆఫీసుకు తీసుకురండి: బీజేపీ స్టేట్ చీఫ్  

ఓట్లు పోయినోళ్లను ఆఫీసుకు తీసుకురండి: బీజేపీ స్టేట్ చీఫ్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో తీవ్ర కరువు ముంచుకొచ్చి, తాగు, సాగునీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్. రాంచందర్ రావు అన్నారు. ఇలాంటి సమయంలో కనీస బాధ్యత లేకుండా కేబినెట్ భేటీని రద్దు చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి పారిపోయారని విమర్శించారు.

సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ నెల9న సమీక్ష నిర్వహించాలని సీఎస్ స్వయంగా అత్యంత ప్రాముఖ్యమైన నోట్ పంపించినా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. 60 మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఢిల్లీకి పోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.

‘‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నీళ్లు లేవు. పల్లెల్లో కరెంట్ కోతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. అలాంటిది రాహుల్ గాంధీ చేసే పనుల కోసం ప్రజాధనంతో ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేస్తారా?’’ అని ప్రశ్నించారు. జ్యుడీషియరీపై ఒత్తిడి తెచ్చేందుకు రోడ్లెక్కి మార్చ్ చేస్తామనడం న్యాయవ్యవస్థను బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిల్ చేయడమేనని అన్నారు.

రైతులకు వెంటనే ఫసల్ బీమా యోజన అమలు చేయాలని, యాసంగి పంటకు నీళ్లు, కరెంట్ ఎలా ఇస్తారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోవా కాంగ్రెస్ యాత్రలో బీజేపీని రావణుడు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను రాముడు అని రేవంత్ రెడ్డి పోల్చుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ‘ముస్లిం ఈజ్ కాంగ్రెస్.. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం’ అన్న రేవంత్‌‌‌‌‌‌‌‌కు రాముడి పేరు పలికే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు.

పొన్నం.. ఓట్ల డిలీట్‌‌‌‌‌‌‌‌పై చర్చకు రా

ఓట్లు గల్లంతయ్యాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన చాలెంజ్‌‌‌‌‌‌‌‌ను స్వీకరిస్తున్నట్టు రాంచందర్ రావు తెలిపారు. ‘‘మీరు వేలమందిని తీసుకురానక్కర్లేదు. మీ మజ్లిస్ దోస్తులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలను వెంటేసుకొని సీఈవో దగ్గరికి రావాలి. ఓట్లు పోయిన కనీసం 10 మందిని సీఈవో ఆఫీసుకు తీసుకురండి.. నేను కూడా వస్తా” అని అన్నారు. కంప్యూటర్లలో రికార్డులు పరిశీలిద్దామని, నోటీసు ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏ ఒక్క ఓటూ పోలేదని అన్నారు.

అర్హులైన వారి ఓటు డిలీట్ అయిందని నిరూపిస్తే నమోదు చేయిద్దామని, లేదంటే బహిరంగంగా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నంకు సవాల్‌‌‌‌‌‌‌‌ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు బీసీ దళిత డిక్లరేషన్లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు విడుదల చేసేంతవరకు రాహుల్ గాంధీని తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేశారు.  ప్రజా జీవితంలో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి తెలంగాణ బీజేపీ పక్షాన అభినందనలు తెలుపుతూ ప్రత్యేక తీర్మానం ఆమోదించినట్టు రాంచందర్ రావు తెలిపారు.