న్యూఢిల్లీ: ఇండియా, శ్రీలంక మధ్య డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు మార్చారన్న వార్తలను బీసీసీఐ ఖండించింది. నిబంధనల ప్రకారం ఆ మ్యాచ్‌ను ఢిల్లీకే కేటాయించారని ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశాడు. ‘ఆ మ్యాచ్‌ను ఒక ప్రామాణిక విధానం ప్రకారం ఢిల్లీకి కేటాయించారు.
ఇప్పుడు దాన్ని వేరే వేదికకు ఎలా తరలిస్తారు. వేదికను మార్చే అంశంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్వైపాక్షిక మ్యాచ్‌లను ఒక ప్రామాణిక విధానం ప్రకారం కేటాయిస్తారు. ఒక్కసారి కేటాయించిన తర్వాత మార్చే అవకాశమే ఉండదు’ అని సైకియా పేర్కొన్నాడు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న నిర్మాణ పనుల కారణంగా డిసెంబర్ 19న సిరీస్‌లోని చివరి మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌కు తరలించారని వార్తలు వచ్చాయి. ఈ టూర్‌లో లంక వన్డేలతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
