హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తీవ్రమైన కరవు, ఎల్ నినో పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేకుండా మొద్దునిద్ర పోతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పాలకుల ముందుచూపు లేమి, నిర్లక్ష్యం వల్లే చేతికొచ్చిన పంటలు ఎండిపోయి రైతులు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు.
సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యాసంగిలో పంటలు వేయొద్దంటూ లీకులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని, రైతులు పంటలు వేయకపోతే వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. ఎల్ నినో ప్రభావంపై ప్రపంచ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు 9 నెలలుగా హెచ్చరిస్తున్నా సర్కారు ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బొగ్గు లేదన్నా, కరెంట్ లేదన్నా, నీళ్లు లేవన్నా ప్రభుత్వం ఎల్ నినోపైకి నెట్టేస్తోందని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలను 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పంకు చంద్రబాబు తరలించుకుపోతుంటే, రేవంత్ రెడ్డి పాలమూరు నీళ్లను ఎత్తకుండా ‘పాలమూరు ద్రోహి’గా మిగిలిపోతుందన్నారు.
