చేవెళ్ల, వెలుగు : గుర్తుతెలియని వ్యక్తులు కారులో తీసుకువచ్చి ఓ మహిళ తలపై కత్తితో పొడిచి వదిలేసి పారిపోయారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన కల్సాని వీణ (26) 3వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు మీర్జాగూడ గేట్‌కు ఎడమవైపు100 మీటర్ల దూరంలోని పొలంలో ఓ మహిళ గాయాలతో పడి ఉండడం గుర్తించిన ఓ రైతు 100కు కాల్చేసి చెప్పాడు.
ఆమెను ఏమైందని అడగ్గా ‘నాది వరంగల్’ అని మాత్రమే చెప్పింది. తర్వాత పోలీసులు బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. ఆమె గురించి సోషల్‌మీడియాలో ప్రచారం కావడంతో ఆమె తండ్రి ఇంద్రారెడ్డి దవాఖానకు వచ్చారు. చిన్నప్పటి నుంచి వీణ మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పారు. గత ఏడాది 3 నెలలు చికిత్స పొందిందని, అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి 3, -4 రోజుల తర్వాత తిరిగి వస్తుందని చెప్పాడు.
ఈ సారి 3వ తేదీ బయటికి వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఎవరు దాడి చేశారో ..ఎందుకు చేశారో తెలియడం లేదని అన్నాడు. తన కూతురుపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేశారని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
