సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడానికి కంటెంట్ క్రియేటర్లు హద్దులు దాటి చేస్తున్న పిచ్చి పనులు దేశం పరువు మంటగలుపుతున్నాయి. కొందరు ట్రావెల్ వ్లాగర్స్ విదేశాల్లో ఇండియా పరువు తీసేలా ప్రవర్తించి, చివరకు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా థాయ్‌లాండ్‌లో ఒక భారతీయ యూట్యూబర్ చేసిన పని అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. 'డబ్బులు లేకుండా ప్రపంచాన్ని చుట్టేయాలనే' వింత ప్రయోగంతో థాయ్‌లాండ్‌కు వెళ్లిన ఎథింగ్ బన్షీ అనే యూట్యూబర్.. ఒక బౌద్ధ దేవాలయంలో టెంట్ వేయడానికి ప్రయత్నించి పోలీసుల చేతికి చిక్కాడు.
ఉడాన్ థానీ ప్రాంతంలోని ఒక పవిత్రమైన బౌద్ధ ఆలయ ప్రాంగణంలో బన్షీ టెంట్ వేస్తుండటాన్ని గమనించిన స్థానికులు, ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆలయం అనేది పడుకోవడానికి, క్యాంపింగ్ చేయడానికి వాడే ప్రదేశం కాదని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే తాను ఎవరో ఒక సన్యాసితో మాట్లాడానని, రాత్రికి ఇక్కడే ఉండటానికి అనుమతి ఉందని బన్షీ పోలీసులతో వాదనకు దిగాడు. దాదాపు 20 నిమిషాల పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పటికీ వారు ససేమిరా అన్నారు. సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రాత్రి బస కోసం సమీపంలోని బడ్జెట్ హోటల్‌కు వెళ్లాలని సూచించారు. కానీ తన ప్రయాణంలో ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు చేసిన ఉచిత సలహాను సహాయాన్ని బన్షీ తిరస్కరించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను "థాయ్‌లాండ్ గుడ్ పోలీస్ సే గెట్ అవుట్ ఆఫ్ ది టెంపుల్ నౌ" అనే టైటిల్‌తో యూట్యూబ్‌లో పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. థాయ్‌లాండ్ మీడియా సంస్థలైన ఖావోసోద్, నాయ్‌వనా ఈ విషయాన్ని ప్రసారం చేయడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. డబ్బులు లేకుండా థాయ్‌లాండ్‌లో తిరుగుతూ ఇతరులను దానాలు అడగడం, పవిత్ర దేవాలయాలను రాత్రి పూట పడుకోవటానికి అడ్డాగా మార్చుకోవడానికి ప్రయత్నించడంపై భారతీయుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరైతే ఈ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని దేశం నుంచి బహిష్కరించాలని మండిపడ్డారు.
థాయ్‌లాండ్ రూల్స్ ప్రకారం.. ఆ దేశానికి వెళ్లే పర్యాటకులు కచ్చితంగా రిటర్న్ టికెట్, అకామడేషన్ ప్రూఫ్, ట్రావెలింగ్ కోసం కనీస బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్, వీసా లెస్ ఎంట్రీ కింద వెళ్లే పర్యాటకులు కనీసం 10వేల బాట్లు వ్యక్తిగతంగా లేదా 20వేల బాట్లు కుటుంబం తరఫున కలిగి ఉండటం తప్పనిసరి. కేవలం వ్యూస్, డబ్బుల కోసం పర్యాటక నిబంధనలను ఉల్లంఘిస్తూ.. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న ఇలాంటి కంటెంట్ క్రియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
