వెయ్యి రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ప్రారంభం : ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు..!

వెయ్యి రూపాయల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం ప్రారంభం : ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు..!

ఒకప్పుడు నెలకు కేవలం రూ.1,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఓ అధికారి ఆస్తుల వివరాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దాదాపు 39 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన ఆయన, ప్రస్తుతం మూడు భవనాలు, 19 ప్లాట్లు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, కార్లు, బైక్‌లు వంటి ఆస్తులు ఉన్నట్లు విజిలెన్స్ అధికారుల సోదాల్లో బయటపడింది.

ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల బ్లాక్‌లో అసిస్టెంట్ బ్లాక్ విద్యాశాఖ అధికారిగా (ABEO) పనిచేస్తున్న జయదేవ్ జెనా ఇల్లు, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే, ఇప్పటివరకు బయటపడిన ఆస్తుల మొత్తం విలువ ఎంత అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బు, ఇతర పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలుకు ఖర్చు చేసిన మొత్తాలపై కూడా విచారణ కొనసాగుతోంది.

మూడు భవనాలు, 19 ప్లాట్లు.. భారీగా ఆస్తులు 
విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో జయదేవ్ జెనాకు సంబంధించిన మూడు మల్టి ఫ్లోర్ బిల్డింగులు, 19 భూమి ప్లాట్లు గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఒక టాటా నెక్సాన్ కారు, బైక్  కూడా గుర్తించారు.

ఈ ఆస్తులు ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి గంజాం జిల్లా వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జయదేవ్ జెనా పేరుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ఈ ఆస్తులను ఎప్పుడు కొనుగోలు చేశారు ? ఒక్కో ఆస్తి కోసం ఎంత డబ్బు ఖర్చు చేశారు ? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఈ ఆస్తుల విలువ ఎంత ఉంది ? అనే అంశాలపై అధికారులు ప్రస్తుతం దృష్టి పెట్టారు.

ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన డబ్బుకు, ఆయనకు వచ్చిన జీతం, ఇతర చట్టబద్ధమైన ఆదాయ మార్గాలకు సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

నెలకు రూ.1,000 జీతం
జయదేవ్ జెనా 1969 మే 5న జన్మించారు. ఆయన 1987 ఆగస్టు 25న ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. పునరావాసం, పునఃస్థాపన పథకం కింద ఆయనకు ఉద్యోగం లభించింది. ఆ సమయంలో ఆయన గంజాం జిల్లాలోని ఛత్రపూర్‌లో జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో సహాయ ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరినప్పుడు ఆయనకు నెలకు కేవలం రూ.1,000 జీతం మాత్రమే వచ్చేది.

అక్కడి నుంచి ఆయన విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ క్రమంగా పదోన్నతులు పొందారు. ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన ఆయన ఉద్యోగ జీవితం, చివరకు అసిస్టెంట్ బ్లాక్ విద్యాశాఖ అధికారి స్థాయికి చేరుకుంది. ఈ ఉద్యోగ ప్రయాణంలో ఆయన పనిచేసిన స్కూల్స్, నిర్వహించిన బాధ్యతలు, పొందిన పదోన్నతులకు సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 36 ఏళ్లకు పైగా ఉద్యోగ అనుభవం తర్వాత ఆయన విద్యాశాఖలో అధికారిగా బాధ్యతలు నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. 

గంజాం నుంచి భువనేశ్వర్ వరకు..  
జయదేవ్ జెనాకు సంబంధించిన ఆస్తుల వివరాలను తెలుసుకునేందుకు విజిలెన్స్ అధికారులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.  అంతేకాకుండా, గంజాం జిల్లాలోని బురుఝరిలో ఉన్న ఆయన బంధువు ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతం, జనని విహార్‌లో ఉన్న మరో బంధువు ఇంటికి సంబంధించిన వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.

బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపైనా అధికారుల దృష్టి
ఇప్పటివరకు స్థిరాస్తులు, ఆభరణాలు, వాహనాలకు సంబంధించిన వివరాలు బయటపడగా, ప్రస్తుతం బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, ఇతర పెట్టుబడుల వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

జయదేవ్ జెనా, ఆయన కుటుంబ సభ్యులకు వివిధ బ్యాంకుల్లో ఎంత డబ్బు ఉంది? ఎలాంటి పెట్టుబడులు పెట్టారు? ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించిన డబ్బు ఏ ఖాతాల నుంచి వచ్చింది? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. నెలకు రూ.1,000 జీతంతో సహాయ ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన జయదేవ్ జెనా, సుదీర్ఘ కాలంలో విద్యాశాఖ అధికారిగా ఎదిగి.. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు విజిలెన్స్ సోదాల్లో బయటపడటంతో ఈ వ్యవహారం వార్తల్లో నిలిచింది.