మద్యం ప్రియులకు ఎంతో ఇష్టమైన ఓల్డ్ మంక్ రమ్ బ్రాండ్‌కు షాకింగ్ న్యూస్. ఈ లెజెండరీ బ్రాండ్‌ను తయారు చేసే మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తాజాగా బాంబే హైకోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది. మహారాష్ట్రలోని తమ ప్లాంట్‌పై ఆంక్షల వల్ల కంపెనీకి ఏకంగా రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని కోర్టుకు తెలిపింది. కేవలం కంపెనీకే కాకుండా.. దీనివల్ల మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ రెవెన్యూ రూపంలో సుమారు రూ.350 కోట్ల భారీ నష్టం జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
ఈ వివాదం మహారాష్ట్రలోని ఖోపాలి ప్లాంట్‌లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు తనిఖీలు నిర్వహించటంతో మెుదలైంది. ఈ తనిఖీల తర్వాత ఓల్డ్ మంక్ రమ్ తయారీలో వాడుతున్న ఫార్ములేషన్, ఇంగ్రిడియెంట్స్, లేబులింగ్‌పై FSSAI తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. న్యూట్రల్ ఆల్కహాల్‌కి 'రమ్ ఫ్లేవర్' ఆర్టిఫిషియల్‌గా కలిపి అమ్మేయటంతో దాన్ని 'రమ్' అని ఎలా పిలుస్తారని రెగ్యులేటర్ ప్రశ్నించింది. అంతేకాకుండా లేబుల్స్‌పై '7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్', 'వెరీ ఓల్డ్ వ్యాట్టెడ్' వంటి డిస్క్రిప్షన్లు ఉండటంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పదాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, మొత్తం బ్లెండ్ ఏజ్ చేయబడిందనే అపోహను కలిగిస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వాధించారు.
కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా మోహన్ రాకీ తరఫున సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ వాదనలు వినిపిస్తూ.. తమ కంపెనీపై అనవసరమైన ఆంక్షలు విధించారని అన్నారు. నిబంధనల ప్రకారమే ఆమోదిత అడిటివ్‌లను వినియోగిస్తున్నామని, మార్కెట్లో ఇతర పోటీ బ్రాండ్లు కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అయితే అధికారులు మాత్రం ఒక షరతు ముందుంచారు. తయారీదారులు తమ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్‌ను 'రమ్' నుంచి 'రమ్-లైక్' లేదా ఫ్లేవర్డ్ స్పిరిట్‌గా మారుస్తామని అంగీకరిస్తే అమ్మకాలను అనుమతి ఇస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఇక ఈ వివాదంపై బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నా లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరుపుతోంది. తొలుత మధ్యంతర స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో.. కంపెనీ స్వయంగా వివాదాస్పద వయస్సు-సంబంధిత వివరాలను తొలగించి, 'ఆడెడ్ ఫ్లేవర్' అని స్పష్టంగా ముద్రించిన రివైజ్డ్ లేబుల్స్‌ను సమర్పించింది. అయినప్పటికీ రెగ్యులేటర్ వాటిని ఆమోదించలేదు. ఈ కేసు విచారణను అక్టోబర్ 23కి కోర్టు వాయిదా వేసింది. ఓల్డ్ మంక్ లాంటి అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన బ్రాండ్.. రెగ్యులేటరీ అధికారుల మధ్య నడుస్తున్న ఈ న్యాయపోరాటంలో రాబోయే రోజుల్లో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
