నకిలీ ఫేస్‌బుక్ పేజీపై చందానగర్ పోలీస్ స్టేషన్లో కంటెంట్ క్రియేటర్ కౌశిక్ మరిడి ఫిర్యాదు

నకిలీ ఫేస్‌బుక్ పేజీపై చందానగర్ పోలీస్ స్టేషన్లో కంటెంట్ క్రియేటర్ కౌశిక్ మరిడి ఫిర్యాదు

ప్రముఖ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ కౌశిక్ మరిడి పోలీసులను ఆశ్రయించారు. తన చానెల్ కు సంబంధించిన ఆటోమొబైల్ వీడియోలను గుర్తుతెలియని వ్యక్తి అనధికారికంగా ఉపయోగిస్తున్నట్లు వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ పేజీతో తన కంటెంట్ వాడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని 2026 అక్టోబర్ 12 పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.

సెప్టెంబర్ 27 న Kowshik Automobile పేరుతో  గుర్తుతెలియని వ్యక్తి ఒక నకిలీ ఫేస్‌బుక్ పేజీని సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఒరిజినల్ ఆటోమొబైల్ వీడియోలను డౌన్‌లోడ్ చేసి అక్టోబర్ 11, 2026 నాటికి మొత్తం 17 వీడియోలను  అప్‌లోడ్ చేసినట్లు పోలీసులకు తెలిపారు.  

​ఈ అక్రమ వినియోగంపై మెటా సంస్థకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ నకిలీ పేజీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని  బాధితుడు కౌశిక్ మారిడి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నకిలీ పేజీ కారణంగా తన బ్రాండ్ పేరుపై ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని చెప్పారు. అధికారిక ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కౌశిక్ మరిడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు చందానగర్ పోలీసులు. నకిలీ పేజీని నిర్వహిస్తున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తించేందుకు  దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.