అంబానీ కన్నా చౌకగా ఇంటర్నెట్ అందిస్తా.. స్టార్ లింక్ ఓనర్ మస్క్ ప్రకటన

అంబానీ కన్నా చౌకగా ఇంటర్నెట్ అందిస్తా.. స్టార్ లింక్ ఓనర్ మస్క్ ప్రకటన

న్యూఢిల్లీ: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మధ్య స్టార్‌‌‌‌లింక్ ఎంట్రీపై వివాదం రాజుకుంది. అంబానీకి మద్దతుగా ఆన్ లైన్‎లో తనకు కౌంటర్ ఇస్తున్న వారిని విమర్శిస్తూ ‘వింతైన హిపోక్రసీ, హాస్యాస్పద వాదనలు చేస్తున్నారు’ అంటూ మస్క్ పోస్టు చేశారు. స్టార్‌‌‌‌లింక్ వల్ల అంబానీకి ఎలాంటి ముప్పు లేదని ఒకవైపు చెబుతూనే, మరోవైపు అది తీవ్రమైన పోటీని ఇస్తుందనడం విడ్డూరమని మండిపడ్డారు.

‘ఇది పూర్తిగా అర్థరహితం. హాస్యాస్పదం.. వారి వాదనకు పూర్తి విరుద్ధం. స్టార్‌‌‌‌లింక్‌‌‌‌ రాకతో భారతీయ ప్రజలకు ఇంటర్నెట్‌‌‌‌లో మరిన్ని ఆప్షన్లు పెరుగుతాయి. అంబానీ లాభాలు తగ్గొచ్చు కానీ, వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగరు. ఖరీదు ఎక్కువగా ఉంటే.. ఎవరూ కొనుగోలు చేయరు. అప్పుడు ధరలను తగ్గించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది’ అని ఎక్స్​లో స్పష్టం చేశారు. 

అంబానీ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే స్టార్‌‌‌‌లింక్‌‌‌‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే  ముకేశ్ అంబానీకి మద్దతుగా ఉన్న కొన్ని సంస్థలు అధికార బీజేపీకి రాజకీయ విరాళాలు అందజేశాయంటూ సోషల్ మీడియాలో మస్క్‌‌‌‌ పలు పోస్టులు చేశారు. ఇండియన్‌‌‌‌ ఎక్స్​ప్రెస్‌‌‌‌, అల్‌‌‌‌జజీరా సంస్థల వార్త కథనాలను షేర్‌‌‌‌ చేశారు.

అంబానీనే భారత్ కు నిజమైన ప్రధాని అంటూ సెటైర్​ వేశారు. అయితే, మస్క్‌‌‌‌ తన పోస్టులో ధరల గురించే ప్రస్తావించారు, కానీ భద్రతా అంశాల ఊసు ఎత్తలేదు. వాస్తవానికి భారత్‌‌‌‌ శాటిలైట్‌‌‌‌ ఆధారిత ఉపగ్రహ సేవలకు స్టార్‌‌‌‌ లింక్‌‌‌‌, జియో శాట్‌‌‌‌లైట్‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌‌‌ కమ్యూనికేషన్స్‌‌‌‌కు చెందిన వన్‌‌‌‌వెబ్‌‌‌‌ దరఖాస్తు చేసుకొన్నాయి. వీటిల్లో ఏ సంస్థకూ ఇప్పటి వరకు పూర్తిస్థాయి అనుమతులు రాలేదు.

గ్రోక్‌‌‌‌తో కొనుగోళ్లు.. భద్రతపై సందేహాలు

చాట్‌‌‌‌బాట్ ‘గ్రోక్’ ద్వారా ఆన్‌‌‌‌లైన్ షాపింగ్ చేసే విప్లవాత్మక విధానాన్ని ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. క్రెడిట్ కార్డ్ ఫొటోను చాట్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్ చేస్తే, గ్రోక్ అత్యుత్తమ ధరలను వెతికి స్వయంగా ఆర్డర్ చేస్తుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే, ఈ విధానం ప్రస్తుతం టెక్‌‌‌‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. క్రెడిట్ కార్డ్ ఫొటోల ద్వారా సున్నితమైన ఆర్థిక సమాచారం లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లావాదేవీల డేటా క్లౌడ్‌‌‌‌లో నిల్వ కావడం వల్ల మానవ సమీక్షకు గురికావచ్చనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది తీవ్రమైన భద్రతా ముప్పునకు దారితీస్తుందని ఓపెన్‌‌‌‌ఏఐ ఎగ్జిక్యూటివ్ టిబో కూడా అభిప్రాయపడ్డారు. అసలు క్రెడిట్ కార్డ్ వివరాలు పంచుకునే బదులు, సింగిల్ యూజ్ వర్చువల్ కార్డ్ నంబర్లను వాడేలా టూల్స్ ఉండాలని యూజర్లు సూచిస్తున్నారు.