- వర్షాభావ పరిస్థితుల్లో నిర్ణయం
- నిరుడు మంచి దిగుబడులు
- ఆసక్తి చూపుతున్న రైతులు
- ప్రోత్సహిస్తున్న సర్కారు
- గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు
హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌లో మక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిరుడు మక్క సాగుతో మంచి దిగుబడి, ఆదాయం రావడంతో ఈసారి ఎక్కువ మంది రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఈ వానాకాలం సీజన్‌లో పత్తి దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, పెట్టుబడులు పెరిగి నష్టాలు ఎదురవుతుండటంతో ప్రత్యామ్నాయ పంటలపై అన్నదాతలు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే మక్కవైపు మళ్లుతున్నారు.
వానాకాలంలో సాగైన పత్తిని తొలగించి.. దాని స్థానంలో మక్క పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మక్క సాగు చేసి అనుభవం ఉన్న రైతులు మరోసారి అదే పంట వేయాలని భావిస్తుండగా, కొత్తగా సాగు చేసేందుకు మరికొందరు ముందుకొస్తున్నారు.ఈసారి మక్క సాగు విస్తీర్ణం పెరిగే చాన్స్ రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు మక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 6.45 లక్షల ఎకరాలుగా ఉంది. ఈసారి పరిస్థితులను బట్టి ఆ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 5.93 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగైంది. యాసంగిలోనూ రైతులు పెద్ద సంఖ్యలో ఈ పంటను ఎంచుకుంటే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. అయితే, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, బోర్లు, బావుల్లో భూగర్భ జలాల మట్టాలు పంట సాగు నిర్ణయాల్లో కీలకం కానున్నాయి.
నీటి వినియోగం తక్కువ.. డిమాండ్ ఎక్కువ
వరి పంటతో పోలిస్తే మక్కజొన్న సాగుకు నీటి అవసరం తక్కువ. దీంతో పరిమిత నీటి వనరులున్న రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తికి మక్కజొన్న వినియోగం పెరుగుతుండటం మార్కెట్‌లో ఈ పంటకు డిమాండ్ పెరిగింది. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలిపే విధానం అమల్లో ఉండటంతో.. ఈ తయారీ పరిశ్రమలకు మక్కజొన్న కీలక ముడిసరుకుగా మారింది. పశువుల దాణా, పౌల్ట్రీ ఫీడ్ తయారీలోనూ మక్కజొన్నను వినియోగిస్తుండటంతో మార్కెట్‌లో దీనికి వివిధ రంగాల నుంచి డిమాండ్ ఉంటోంది.
ఈ పరిణామాలు రైతులను మక్కజొన్న సాగు వైపు ఆకర్షిస్తున్నాయి.గ్రామాల్లోనే కొనుగోళ్లకు ఏర్పాట్లుమక్క సాగుపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పంట మార్కెట్‌కు వచ్చినప్పుడు విక్రయాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు మక్కల కొనుగోలు ఏర్పాట్లు చేస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నది. పంటను దూర ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలించాల్సిన అవసరం తగ్గడంతో, రవాణా ఖర్చులు ఆదా అవుతుండడం, మద్దతు ధరపై స్పష్టత ఉండడం సాగు నిర్ణయాలపై సానుకూల ప్రభావం చూపుతున్నది.
ధరలపైనే రైతుల దృష్టి
ఓ వైపు మక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నా.. రైతులు ధరలపైనా సమాలోచన చేస్తున్నారు. మక్క మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,410 ఉండగా.. మార్కెట్‌లో రూ.2,775 వరకు ధర పలుకుతున్నది. అయితే, ప్రస్తుతం ఉన్న డిమాండ్ యాసంగిలో పంట మార్కెట్‌లోకి వచ్చే సమయానికీ కొనసాగుతుందా? దిగుబడులు పెరిగితే ధరలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే అంశాలను రైతులు బేరీజు వేసుకుంటున్నారు. సాగు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీ రేట్లు, నీటి లభ్యతను లెక్కలోకి తీసుకొని పంట ఎంపికపై నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరతోపాటు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పంట సేకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంపైనే రైతుల ఆదాయం ఆధారపడి ఉంటుంది. గతేడాది అనుభవం, ప్రస్తుత మార్కెట్ డిమాండ్ నేపథ్యంలో ఈ యాసంగిలో మక్కజొన్న సాగు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
