ఖర్చు డబుల్..  ఫలితం ట్రబుల్..  కాళేశ్వరం నుంచి  యాదాద్రి దాకా  ఇదే తీరు

ఖర్చు డబుల్..  ఫలితం ట్రబుల్..  కాళేశ్వరం నుంచి  యాదాద్రి దాకా  ఇదే తీరు
  • రాష్ట్రానికి శాపంగా గత సర్కారు నిర్ణయాలు
  • దొరకని జీ9 బొగ్గుతో గనులకు దూరంగా
  • పవర్ ప్లాంట్ల నిర్మాణం మతలబేంటి?
  • లక్ష కోట్లు పెట్టి కట్టినా.. కాళేశ్వరం నీళ్లిస్తలె
  • నిరుపయోగంగా 2,600 రైతు వేదికలు  
  • డబుల్ బెడ్రూం కట్టలే.. కట్టిన కాడ ఇయ్యలె
  • ఓట్ల కోసం దళితబంధు.. తర్వాత నో ఫండ్స్  
  • పదేళ్ల తర్వాత మిగిలింది అప్పులు, వడ్డీలే
     


హైదరాబాద్, వెలుగు:లక్ష కోట్లు అప్పు చేసి నిర్మించిన కాళేశ్వరం కరువులో అక్కరకు రావడం లేదు.. దొరకని జీ9 బొగ్గుతో గనులకు దూరంగా ఏర్పాటు చేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు కరెంటివ్వడం లేదు. అన్నదాతలకు సలహాలిస్తామంటూ కట్టిన రైతు వేదికలు నిరుపయోగంగా మారాయి. డబుల్ బెడ్రూం ఇండ్లిస్తామంటూ ప్రారంభించిన హౌసింగ్ స్కీం అభాసుపాలైంది. మెజార్టీ ఊర్లలో ఇండ్లే కట్టలేదు.. కట్టిన చోట లబ్ధిదారులకు ఇవ్వలేదు. నాణ్యత లేకపోవడంతో పలుచోట్ల కూలిపోయి శిథిలాలు మాత్రమే మిగిలాయి. తెలంగాణ రూపురేఖలు మారుస్తామంటూ గత సర్కారు​ చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, వాటి కోసం తెచ్చిన అప్పులు ఇప్పుడు రాష్ట్రానికి గుదిబండలా మారాయి. అనాలోచిత సంక్షేమ పథకాలు ఖజానాను దివాలా అంచుకు చేర్చాయి. వీటి కోసం కార్పొరేషన్లు, సంస్థల పేరుతో వివిధ మార్గాల్లో తెచ్చిన అప్పులు రూ.8.2 లక్షల కోట్లకు చేరాయి. ఇప్పుడు రాష్ట్రానికి అప్పులు.. తిప్పలే మిగిలాయి..

కష్టాలు తీర్చని కాళేశ్వరం

ప్రాణహిత-–చేవెళ్ల డిజైన్‌‌‌‌‌‌‌‌ను మార్చి కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి రూ. 1,10,248 కోట్లకు పెరిగింది. ఇందులో కొంత మొత్తాన్ని గత ప్రభుత్వం బ్యాంకుల నుంచి11.5 నుంచి 12 శాతం వడ్డీకి అప్పు గా తీసుకొచ్చింది. ప్రాజెక్ట్​ నిర్మాణంలో నిపుణుల కమిటీ సూచనలను పట్టించుకోలేదని, నాణ్యత పరీక్షలు తగినన్ని జరగలేదని కమిషన్ పేర్కొంది. 37,288 కాంక్రీట్ నమూనాలకుగానూ 7,498 మాత్రమే పరీక్షించారని నివేదిక వెల్లడించింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్లు 2023 అక్టోబరులో కుంగిపోయాయి. 

కొంత అప్పు 11.5 నుంచి 12 శాతం వడ్డీకి తీసుకున్నారు.మిగిలిన పనులకు మరో రూ. 47,000 కోట్లు కావాలని కూడా పేర్కొంది. ఇంత ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రైతాంగం కష్టాలు తీర్చడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సీపేజీలు ఏర్పడటంతో గేట్లు మూయలేని పరిస్థితి దీంతో మేడిగడ్డకు ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్లు వచ్చినట్టే గోదావరిలో కలిసి దిగువకు వెళ్లిపోతున్నాయి.  

దొరకని బొగ్గుతో యాదాద్రి థర్మల్ ప్లాంట్

గత ప్రభుత్వ హయాంలో దామరచర్ల వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను నిర్మించారు. బొగ్గు గనులకు దూరంగా.. రాష్ట్రంలో దొరకని జీ-9 గ్రేడ్ నాణ్యత గల బొగ్గును మాత్రమే వాడే ప్రత్యేక సాంకేతికతతో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఆ బొగ్గును కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద గుది బండగా మారింది. 4,000 మెగావాట్ల యాదాద్రి ప్లాంట్‌‌‌‌ను మొదట రూ. 20,000 కోట్లకు చేపట్టారు. తర్వాత అంచనా సుమారు రూ. 55,000 కోట్లకు పెరిగింది. మొత్తం ఐదు యూనిట్లకు గాను నాలుగు నిర్మించారు. ఇందులో మూడు యూనిట్లలో తరుచూ సమస్యలు వస్తున్నాయి. అప్పటి అధికార పక్షం పర్యావరణ అనుమతుల్లో లోపాల వల్ల రెండేళ్లు ఆలస్యమైందని, దీంతో ఖర్చు భారీగా పెరిగిందన్నది ప్రధాన ఆరోపణ

విద్యుత్ కొనుగోళ్ల చిక్కుముడి

తెలంగాణ ఏర్పడిన నాటి కరెంటు కోతల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం కేసీఆర్ ప్రభుత్వం తన అతిపెద్ద విజయంగా చెప్పుకుంది. నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని 2014లో తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌‌గఢ్‌‌తో 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. యూనిట్ ధర రూ. 3.90. టెండర్ల ద్వారా కాకుండా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం ద్వారా ఇది జరిగింది. విద్యుత్ సరఫరా 2017లో మొదలైంది. 2022 ఏప్రిల్‌‌లో ఛత్తీస్‌‌గఢ్ సరఫరా ఆపేసింది. ఈ కొనుగోళ్లకు రూ. 7,719 కోట్లు చెల్లించారు. ఛత్తీస్‌‌గఢ్‌‌కు ఇంకా రూ. 1,081 కోట్ల బకాయిలున్నాయి. ఒప్పందం ప్రకారం సరఫరా పూర్తిగా రాకపోవడంతో 2017 నుంచి 2022 మధ్య బహిరంగ మార్కెట్‌‌లో కొనాల్సి వచ్చింది. దీనివల్ల అదనంగా రూ. 2,083 కోట్ల భారం పడిందని చెబుతున్నారు. ఈ విద్యుత్‌‌ను తీసుకురావడానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి స్పెషల్ ట్రాన్స్‌‌మిషన్ కారిడార్ తీసుకున్నారు. ఇందుకు సుమారు రూ. 600 కోట్లు చెల్లించినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు చెబుతున్నారు. సరఫరా ఆగిపోయినా ఆ భారం కొనసాగిందని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ వర్గాలు సుమారు రూ. 6,000 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాయి. 

నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు

భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని బహిరంగ పోటీ టెండర్ లేకుండా నామినేషన్ ప్రాతిపదికన బీహెచ్‌‌ఇఎల్‌‌కు ఇచ్చారనే విమర్శలున్నాయి. విద్యుత్ సంక్షోభం వస్తుందని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. యాదాద్రి కోసం బీహెచ్‌‌ ఇఎల్‌‌కు ఇచ్చిన రూ. 17,950 కోట్ల ఒప్పందం ఆ సంస్థ చరిత్రలోనే అతి పెద్దదిగా నమోదైంది. ఈ ప్లాంట్లు ఆలస్యం కావడం, ఖర్చులు పెరగడం ప్రశ్నలకు కారణమయ్యాయి. 2024 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ను నియమించింది.  దీనిపై కేసీఆర్ కోర్టుకు వెళ్లడంతో జస్టిస్ లోకూర్ నేతృత్వంలో కమిషన్ ను నియమించి విచారణ పూర్తి చేసింది.

రైతు వేదికలు.. ఉత్సవ విగ్రహాలు

ప్రతి 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున 2,600కు పైగా రైతు వేదికలను సుమారు రూ. 570 కోట్లతో నిర్మించారు. ఒక్కో వేదికకు సుమారు రూ. 22 లక్షలు ఖర్చయింది. కరీంనగర్ ప్రాంతంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు, నిర్వహణ నిధులు నాలుగేళ్లుగా విడుదల కావడం లేదని, కరెంటు బిల్లులు, శుభ్రత ఖర్చులు జేబులోంచి పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 2025లో వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాలు కూడా కల్పించింది. వీటి అసలు లక్ష్యం నెరవేరలేదు.. ఉత్సవ విగ్రహాల్లా మారాయి. 

డబుల్ బెడ్రూం కట్టలే.. అక్కడక్కడ కట్టినా ఇవ్వలే 

2015లో ప్రారంభించిన పథకంలో లక్షల ఇళ్ల హామీ ఇచ్చారు. కానీ ఆలస్యం, అసంపూర్ణ నిర్మాణాలు, నీరు, కరెంటు వసతుల లేమితో అనేక ప్రాంతాల్లో పూర్తయిన ఇళ్లు ఖాళీగా ఉండిపోయాయి. 2022లో కొన్ని జిల్లాల్లో పూర్తయిన ఇళ్లలో కొద్ది శాతమే ప్రజలకు చేరాయి. ఎన్నికల ముందు కేటాయింపుల్లో బీఆర్​ఎస్​ లీడర్లు, కార్యకర్తలకే  ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న లక్ష్యం ఆశించినంతగా నెరవేరలేదు. రాష్ట్రంలో చాలా చోట్ల అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి అర్హులకు అందిస్తోంది. 

వెలగని అమరజ్యోతి.. దరి చేరని దళితబంధు 

స్వరాష్ట్రం కోసం అసువులు బాసిన అమర వీరులను స్మరించేందుకు హుస్సేన్ సాగర్ కట్టమీద నిర్మించిన అమరజ్యోతి లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ అమరవీరుల స్మారకం వ్యయం మొదట రూ. 80 కోట్లుగా ప్రకటించారు. పూర్తయ్యేసరికి అది సుమారు రూ. 177 కోట్లకు చేరింది. 2023 జూన్‌‌లో ప్రారంభించారు. కానిప్పుడు పూర్తి స్థాయిలో వినియోగంలో లేకుండాపోయింది.  2021 ఆగస్టులో హుజూరాబాద్‌‌ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ ప్రారంభించిన దళిత పథకం ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చేలా రూపొందించారు.  2022లో బడ్జెట్లో రూ. 17,200 కోట్లు కేటాయించినా నిధుల కొరత వల్ల విడుదల కాలేదని అప్పట్లోనే వార్తలొచ్చాయి. దీంతో దళితుల కుటుంబాలకు లబ్ధి చేకూరలేదు.