కుత్బుల్లాపూర్, వెలుగు : ప్రాణ స్నేహితుడని నమ్మి పెట్టుబడి పెడితే నష్టం వచ్చిందని నాటకం ఆడాడంటూ గొంతు కోసి చంపేశాడు. పేట్బషీరాబాద్పీఎస్పరిధిలో ఈ నెల 2న వ్యాపారి నేమారాం చౌదరి మర్డర్కాగా, ఆ కేసును పోలీసులు ఛేదించారు. మేడ్చల్ఏసీపీ శంకరెడ్డి ఆదివారం వివరాలు వెల్లడించారు. గుండ్లపోచంపల్లికి చెందిన నేమారాం చౌదరి (61) అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ఉజ్జమాన్ ఖాస్మీ మంచి ఫ్రెండ్స్. చౌదరికి కిరాణా షాపు ఉండగా..పక్కనే సయ్యద్ఉజ్జమాన్ఖాస్మీకి ఫర్నిచర్ షాపు ఉంది. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగేవి.
బంగారం ధరలు పెరుగుతుండడంతో కొంతకాలం కింద బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టాలని చౌదరి కోరగా...ఖాస్మీ రూ.30 లక్షల వరకు ఇచ్చాడు. కొద్దికాలానికి ఖాస్మీ తన కూతురు పెండ్లి చేయాలని డబ్బులు అడగ్గా, వ్యాపారంలో నష్టం వచ్చిందని చౌదరి బదులిచ్చాడు. తన దగ్గర డబ్బులు లేవని స్పష్టం చేశాడు. ప్రాణ స్నేహితుడని నమ్మితే మోసం చేశాడని ఖాస్మీ భావించాడు. అతడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
పూజలు చేస్తే కష్టాలు పోతాయని..
ఈనెల ఒకటో తేదీన చౌదరిని చంపడానికి యాడారం సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. రెండో తేదీన ఉదయం చౌదరి రూ. 25 లక్షలను తీసుకువెళ్లి ఖాస్మీకి ఇచ్చి వచ్చాడు. మధ్యాహ్నం ఫోన్ చేసిన ఖాస్మీ...‘నీకున్న కష్టాలు, కుటుంబ సమస్యలు పోవాలంటే ప్రత్యేక పూజలు చేయాలి. అల్వాల్రైల్వే బ్రిడ్జి వద్దకు ఫోన్ లేకుండా రా’ అని కోరాడు. కానీ, చౌదరి మాత్రం సాయంత్రం తన టూవీలర్‌పై ఫోన్ తీసుకుని వెళ్లాడు. దీంతో వారు బైక్‌ను అక్కడే పార్క్చేయించి ఆటోలో మేడ్చల్ పీఎస్పరిధిలోని యాడారం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు.
ఇద్దరూ చేతులకు గ్లౌజులు వేసుకుని చౌదరి గొంతు పిసికి చంపేశారు. డెడ్‌బాడీని పొదల్లో, ఫోన్‌ను చెరువులో పడేసి వెళ్లిపోయారు. అంతేగాకుండా ఐదో తేదీన ఏమీ తెలియనట్టు నిందితులను శిక్షించాలని మార్వాడీలు పీఎస్ఎదుట ఆందోళన చేస్తే వారితో కలిసి పాల్గొన్నారు. చౌదరి టూ వీలర్ బ్రిడ్జి వద్ద కనిపించడం, సీసీ టీవీ ఫుటేజీల్లో ఆటోలో వెళ్లడం, ఆటో నంబర్, కాల్ డేటా రికార్డుల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. రూ.లక్ష ఎనబై వేల నగదు, ఆటో , రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్‌కి తరలించారు.
రూ.25 లక్షలు ఇచ్చినా..
తనను చౌదరి మోసం చేశాడని, అలాగే, ఆ డబ్బులు వసూలు చేసుకుని చౌదరిని చంపాలని ఖాస్మీ ప్లాన్ చేశాడు. తన దగ్గర పనిచేసే ఒడిశాకు చెందిన షేక్పటుతో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని, రూ.80వేలు అడ్వాన్సు కూడా చెల్లించాడు. ప్లాన్‌లో భాగంగా చౌదరిని కలిసి ‘మనమిద్దరం మంచి ఫ్రెండ్స్.. నేను నీకు రూ.30 లక్షలు ఇచ్చినా.. పెట్టుబడి పెట్టినవ్.. నీ అదృష్టం.. నా అదృష్టం బాగా లేక నష్టం వచ్చింది. నీ పరిస్థితి బాగా లేదని, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేవని తెలుసు.. రూ.25లక్షలు ఎక్కడన్నా చూడు.. వడ్డీతో కలిపి ఇస్తా’ అనడంతో చౌదరి ఓకే చెప్పాడు. ఈ డబ్బులు తీసుకుని చౌదరిని చంపితే పగ తీరడంతో పాటు డబ్బులు దక్కుతాయని భావించాడు.
