ఆపరేషన్ సక్సెస్.. రిహాబిలిటేషన్ ఫెయిల్! పేద రోగులకు పెనుభారంగా సెంటర్లు! 

ఆపరేషన్ సక్సెస్.. రిహాబిలిటేషన్ ఫెయిల్! పేద రోగులకు పెనుభారంగా సెంటర్లు! 
  •     ప్రభుత్వ రంగంలో జాడలేని న్యూరో, ఆర్థో కేంద్రాలు
  •     గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌‌‌‌‌‌‌‌ లలో సర్జరీ కాగానే రోగులకు డిశ్చార్జి
  •     బ్రెయిన్ సర్జరీ, స్పైన్ ఇంజ్యూరీ, జీబీఎస్ బాధితుల అందని స్టెప్ డౌన్ కేర్
  •     డిశ్చార్జీ కాగానే స్ట్రెచర్లపైనే ప్రైవేట్ రిహాబ్ సెంటర్లకు వెళ్తున్న పరిస్థితి...
  •     నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేట్ సెంటర్లు 

హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైనవారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిన వారికి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి హాస్పిటల్స్ లో సర్జరీలు చేస్తున్నారు. కానీ, అసలు కష్టం ఆ తర్వాతే మొదలవుతున్నది. సర్జరీ తర్వాత రోగి తిరిగి నడవడానికి, మాట్లాడటానికి, స్పృహలోకి రావడానికి నెలలు పడ్తుంది. అప్పటిదాకా అవసరమయ్యే న్యూరో అండ్ ఫిజికల్ రిహాబిలిటేషన్ గవర్నమెంట్ సెక్టార్ లో ఎక్కడా అందుబాటులో లేదు.

ఆపరేషన్ ముగిసి ఐసీయూ నుంచి బయటకు రాగానే బెడ్ల కొరత సాకుతో పేషెంట్లను రెండు, మూడు రోజుల్లోనే డిశ్చార్జి చేసి రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లాలని, లేదా ఇంటికి తీసుకెళ్లాలని డాక్టర్లు పేషెంట్ బంధువులకు చెబుతున్నారు. దీంతో దిక్కుతోచక స్ట్రెచర్లపైనే ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. అక్కడ నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా గుంజుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆస్తులు, నగలమ్ముకుని రోడ్డున పడుతున్నాయి. ఆ స్థోమత కూడా లేని నిరుపేదలు రోగులను ఇళ్లకు తీసుకెళ్లి సరైన వైద్యం అందక కళ్ల ముందే అయినవారిని పోగొట్టుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది.

ఆపరేషన్ తర్వాతే అసలు పరీక్ష.. 

తల పగలడం, మెదడులో రక్తనాళాలు చిట్లడం, వెన్నుపూస విరిగి కాళ్లు చేతులు చచ్చుబడిపోవడం, గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్), పార్కిన్సన్స్ వంటి తీవ్ర నరాల వ్యాధులు వచ్చినప్పుడు సర్జరీ కేవలం ప్రాణాన్ని మాత్రమే కాపాడుతుంది. ఆ తర్వాత మనిషి సాధారణ స్థితికి చేరాలంటే దీర్ఘకాలిక రిహాబిలిటేషన్ చికిత్స తప్పనిసరి. శరీరంలో సత్తువ నింపేందుకు అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ ఫిజియోథెరపీ, మాట పడిపోయిన వారికి స్పీచ్ థెరపీ, ఆహారం మింగేందుకు స్వాలోయింగ్ థెరపీ, నిత్యకృత్యాలు అలవాటు చేసే ఆక్యుపేషనల్ థెరపీ అవసరం. వీటితో పాటు ముక్కులో ఫీడింగ్ ట్యూబ్, శ్వాస కోసం గొంతులో వేసిన ట్రాకియోస్టోమీ, యూరిన్ క్యాథెటర్‌‌‌‌‌‌‌‌లను పర్యవేక్షిస్తూ ఇన్ఫెక్షన్లు రాకుండా చూసే నర్సింగ్ కేర్ నిరంతరం ఉండాలి. ఈ చికిత్స నెలల తరబడి కొనసాగితేనే మనిషి మళ్లీ నిలబడతాడు. కానీ, ఈ అత్యంత కీలకమైన స్టెప్ -డౌన్ కేర్ వ్యవస్థ సర్కారులో ఒక్కటి కూడా లేదు.  

వార్డుల్లోంచి బలవంతంగా గెంటేస్తున్నరు..

రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించే నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ లో ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లు ఉన్నప్పటికీ, అవి కేవలం ఔట్ పేషెంట్లకు, ఐసీయూలో పడుకున్న పేషెంట్లకు కదలికలు నేర్పించడానికే పరిమితమవుతున్నాయి. మానసిక రోగుల కోసం ఎర్రగడ్డ, గాంధీలలో కొన్ని సైకియాట్రిక్, డీ-–అడిక్షన్ డిపార్ట్మెంట్లు ఉన్నా, నరాల వ్యాధులు, పక్షవాతం, వెన్నుపూస క్షతగాత్రులకు నెలల తరబడి అడ్మిట్ చేసుకుని సమగ్ర చికిత్స అందించే ఇన్ -పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ఒక్కటీ ప్రభుత్వ రంగంలో లేదు. పెద్ద హాస్పిటల్స్ లో నిత్యం వేలాది మంది రోగుల రద్దీ ఉండటంతో, సర్జరీ అయి ప్రాణాపాయం తప్పిన వెంటనే రెండు, మూడు రోజుల్లోనే పేషెంట్‌‌‌‌‌‌‌‌ ను బలవంతంగా డిశ్చార్జి చేసి పంపించేస్తున్నారు.   

ప్రైవేట్ రిహాబ్ సెంటర్ల దందా...

సర్కారులో ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో వందలాది ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఈ కేంద్రాల్లో బెడ్ల ఛార్జీల షేరింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌ కు రోజుకు రూ.5 వేల నుంచి రూ.8 వేలు, సింగిల్ రూమ్ లేదా ఐసీయూ సదుపాయం ఉంటే రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా వసూలు చేస్తున్నారు. మందులు, ఫీడింగ్ మెటీరియల్స్, డయాపర్లు, థెరపిస్టుల విజిటింగ్ ఫీజులు అన్నీ కలిపితే నెలకు సగటున రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల దాకా బిల్లులు వేస్తున్నారు. మూడు నెలల పాటు చికిత్స తీసుకుంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు గుల్లవుతున్నాయి. 

ఇన్ ఫెక్షన్లకు కేరాఫ్ గా ప్రైవేట్ రిహాబ్ లు...


సిటీలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్లలో ఉల్లంఘనలు తీవ్రస్థాయిలో ఉన్నా వైద్యారోగ్య శాఖ ఆఫీసర్లు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రూల్స్ ప్రకారం వెంటిలేటర్, ట్రాకియోస్టోమీ ఉన్న తీవ్ర అనారోగ్య బాధితులకు 1:1 నిష్పత్తిలో ఒక్కో రోగికి ఒక్కో శిక్షణ పొందిన నర్సింగ్ స్టాఫ్ ఉండాలి. కానీ ప్రైవేట్ సెంటర్లు ఖర్చులు తగ్గించుకునేందుకు ఐదారుగురు సీరియస్ పేషెంట్లకు కలిపి ఒక్క నర్సును మాత్రమే పెడుతున్నాయి. అర్హత లేని ఆయాలు, వార్డ్ బాయ్‌‌‌‌‌‌‌‌ లతోనే ట్యూబ్ ఫీడింగ్, సక్షన్ చేయిస్తున్నారు. సరైన శానిటైజేషన్, స్టెరిలైజేషన్ లేకపోవడంతో పేషెంట్లకు సెకండరీ ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి. ఇలాంటి ఘటనలతో రోగులు మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం కనీస చర్యలు తీసుకోకపోతుండటం విమర్శలకు దారితీస్తున్నది.

ఆరోగ్యశ్రీ వర్తించదు.. ఇన్సూరెన్స్ రాదు

పేద రోగులను ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆరోగ్యశ్రీ స్కీమ్ కేవలం సర్జరీలు, తీవ్రమైన జబ్బులకు మాత్రమే వర్తిస్తున్నది. ఆపరేషన్ ముగిసిన తర్వాత అవసరమయ్యే దీర్ఘకాలిక రిహాబిలిటేషన్ చికిత్సలు ఆరోగ్యశ్రీ కిందకు రావు. మరోవైపు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు సైతం స్టెప్ డౌన్ కేర్, రిహాబిలిటేషన్ పేరుతో వచ్చే క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ లను తిరస్కరిస్తున్నాయి. ఇది సాధారణ జీవనశైలి సంరక్షణ మాత్రమేనని, హాస్పిటల్ అడ్మిషన్ కాదంటూ రూల్స్ సాకుతో క్లెయిమ్‌‌‌‌‌‌‌‌ లను రిజెక్ట్ చేస్తున్నాయి. దీంతో అటు సర్కారు సాయం అందక, ఇటు ఇన్సూరెన్స్ రాక రోగుల కుటుంబాలే పూర్తిగా జేబుల నుంచి లక్షల రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తున్నది.  

బెడ్‌‌‌‌‌‌‌‌ సోర్స్‌‌‌‌‌‌‌‌ తో రాలిపోతున్న ప్రాణాలు... 

ప్రైవేట్ సెంటర్లలో రోజుకు వేల రూపాయలు చెల్లించలేని నిరుపేదలు గత్యంతరం లేక రోగులను నేరుగా ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నాయి. ఇంట్లో ట్రాకియోస్టోమీ ట్యూబ్‌‌‌‌‌‌‌‌ లను ఎలా నిర్వహించాలో, సక్షన్ ఎలా చేయాలో తెలియదు. సక్షన్ సరిగ్గా చేయకపోతే గొంతులో కఫం పేరుకుపోయి ఊపిరాడక చనిపోతున్నారు. ముక్కు ట్యూబ్ ద్వారా ఆహారం అందించే సరైన పద్ధతి తెలియక, ఆహార పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ప్రాణాంతకమైన ఆస్పిరేషన్ న్యుమోనియా బారిన పడుతున్నారు. శరీర కదలికలు లేకపోవడం, ఎప్పటికప్పుడు పక్కకు తిప్పకపోవడంతో వీపు, పిరుదుల భాగాల్లో మాంసం ఊడిపోయేలా పడకపుండ్లు ఏర్పడి చీము పట్టి సెప్టిసిమియాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ దవాఖానలో లక్షల విలువైన సర్జరీ జరిగి ప్రాణం నిలిచినప్పటికీ, ఆ తర్వాత సరైన రిహాబిలిటేషన్ అందక వేలాది మంది పేషెంట్లు ఇంట్లోనే మంచంపై నరకయాతన అనుభవిస్తున్నారు. 

మహబూబాబాద్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తికి మెదడులో తీవ్ర సమస్య తలెత్తడంతో అక్టోబర్ 2న కుటుంబ సభ్యులు నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఎమర్జెన్సీలో చేర్చారు. మరునాడే డాక్టర్లు బ్రెయిన్​ సర్జరీ చేశారు. కానీ పేషెంట్ ఇప్పటికీ.. వెంటిలెటర్ పైనే ఉన్నాడు. ఆపరేషన్ ఆరోగ్య శ్రీలో ఫ్రీగా జరిగింది. కానీ, డాక్టర్లు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి.. రీహబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ అవ్వాలని చెబుతున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం ముందున్న అసలు ప్రశ్న వెంటిలెటర్ పై ఉన్న ఆయనను ఎక్కడికి తీసుకెళ్లాలి? ఆరోగ్యం కుదటపడాలంటే.. అతడికి కనీసం రెండు, మూడు నెలల పాటు న్యూరో రిహాబిలిటేషన్ అవసరం. కానీ, ప్రభుత్వ రంగంలో అలాంటి ఒక్క వసతీ అందుబాటులో లేదు. ప్రైవేట్ రీహబిలిటేషన్ సెంటర్ కు తీసుకెళ్లి లక్షలు ఖర్చు చేసే స్థోమతా లేదు. అలాగని వెంటిలెటర్ పై ఉన్న పేషెంట్ ను ఇంటికీ తీసుకెళ్లలేరు. ఇది ఈ ఒక్క కుటుంబం ఎదుర్కొంటున్న వేదనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం వందల కుటుంబాలు అనుభవిస్తున్న దుస్థితి. 

టిమ్స్, నిమ్స్‌‌‌‌‌‌‌‌లలో స్పెషల్ సెంటర్లు ఏర్పాటు చేయాలి..


ప్రజారోగ్యంలో సర్జరీలు ఎంత ముఖ్యమో, రోగిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరావాస చికిత్స కూడా అంతే కీలకమని వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిమ్స్, సనత్ నగర్  టిమ్స్ లో స్పెషల్ గా రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్, కొత్త ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోనూ స్టేట్ న్యూరో అండ్ ఫిజికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద న్యూరో, ఆర్థో బాధితులకు సర్జరీ అనంతరం కనీసం 30 నుంచి 60 రోజుల రిహాబిలిటేషన్ ప్యాకేజీని చేర్చాలని, ప్రైవేట్ కేంద్రాల్లో అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేలా కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజాసంఘాలు, పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు.